Masala Buttermilk : మనం మజ్జిగను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. మజ్జిగను తాగడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. శరీరానికి కావల్సిన పోషకాలు కూడా లభిస్తాయి. పెరుగును చిలికి మనం మజ్జిగను తయారు చేస్తూ ఉంటాం. ఈ మజ్జిగలో ఇతర పదార్థాలను వేసి మనం మసాలా మజ్జిగను కూడా తయారు చేసుకోవచ్చు. మసాలా మజ్జిగ ఎంతో రుచిగా ఉంటుంది. తాగిన కొద్ది తాగాలనిపించే ఈ మసాలా మజ్జిగను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా మజ్జిగ తయారీకి కావల్సిన పదార్థాలు..
పెరుగు – ఒక కప్పు, జీలకర్ర – అర టీ స్పూన్, మిరియాలు – పావు టీ స్పూన్, వాము – చిటికెడు, అల్లం – అర ఇంచు ముక్క, చిన్న పచ్చిమిర్చి – 1, కరివేపాకు – ఒక రెమ్మ, కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – తగినంత, చాట్ మసాలా – పావు టీ స్పూన్, ఆమ్ చూర్ పొడి – పావు టీ స్పూన్, నిమ్మరసం – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – 4 కప్పులు.
మసాలా మజ్జిగ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పెరుగును తీసుకుని గడ్డలు లేకుండా బాగా చిలకాలి. తరువాత రోట్లో నిమ్మరసం, నీళ్లు తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కచ్చాపచ్చాగా దంచాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ముందుగా చిలికిన పెరుగులో వేసి మరలా చిలకాలి. తరువాత నిమ్మరసం, నీళ్లు పోసి అంతా కలిసేలా చిలికి గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల చట్ పటా రుచిని కలిగి ఉండే మసాలా మజ్జిగ తయారవుతుంది. దీనిలో సాధారణ నీళ్లకు బదులు చల్లటి నీటిని కూడా పోసుకోవచ్చు. ఈ విధంగా మజ్జిగను చేసుకుని తాగడం వల్ల చక్కటి రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.