Masala Pasta : పాస్తా.. పాస్తాను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పాస్తాతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. పాస్తాతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. పాస్తాతో చేసుకోదగిన వెరైటీ వంటకాల్లో మసాలా పాస్తా కూడా ఒకటి. ఈ పాస్తా చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. బ్యాచిలర్స్, వంటరాని వారు కూడా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే మసాలా పాస్తాను ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా పాస్తా తయారీకి కావల్సిన పదార్థాలు..
మ్యాక్రోని పాస్తా – ఒకటిన్నర కప్పు, ఉప్పు – ఒకటి లేదా ఒకటిన్నర టీ స్పూన్, నూనె – 2 టీ స్పూన్స్, అల్లం తరుగు – అర టీ స్పూన్, వెల్లుల్లి ముక్కలు – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలు – ఒక టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన టమాటాలు – 2, కారం – అర టీ స్పూన్, మిరియాల పొడి – పావు టీ స్పూన్, ధనియాల పొడి -అర టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, టమాట సాస్ – ఒక టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మసాలా పాస్తా తయారీ విధానం..
ముందుగా గిన్నెలో 5 కప్పుల నీటిని తీసుకుని వేడి చేయాలి. ఇందులోనే ఉప్పు, నూనె వేసి వేడి చేయాలి. నీళ్లు మరిగిన తరువాత పాస్తా వేసి ఉడికించాలి. ఈ పాస్తాను మెత్తబడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దీనిని పూర్తిగా వడకట్టి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసివేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత క్యారెట్ , క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి. వీటిని 3 నిమిషాల పాటు వేయించిన తరువాత టమాట ముక్కలు వేసి వేయించాలి. టమాట ముక్కలు మెత్తబడిన తరువాత కారం, ఉప్పు, మిరియాల పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి.
తరువాత టమాట సాస్, రెడ్ చిల్లీ సాస్ వేసి కలపాలి. దీనిని అర నిమిషం పాటు కలుపుతూ ఉడికించిన తరువాత పాస్తా వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా చక్కగా కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మసాలా పాస్తా తయారవుతుంది. దీనిని అల్పాహారంగా లేదా స్నాక్స్ గా కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఈ విధంగా చేసిన పాస్తాను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.