Masala Vankaya : మనం గుత్తి వంకాయలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. గుత్తి వంకాయలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో మసాలా వంకాయ కూర కూడా ఒకటి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ కూరను తయారు చేయడం కూడా చాలా సులభం. ఎవరైనా ఈ కూరను చాలా తేలికగా, చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు. తరచూ ఒకే రకం వంటకాలు కాకుండా వంకాయలతో అప్పుడప్పుడూ ఇలా మసాలా వంకాయ కూరను కూడా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే మసాలా వంకాయ కూరను సులభంగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా వంకాయ తయారీకి కావల్సిన పదార్థాలు..
వంకాయలు – పావుకిలో, ఉల్లిపాయ పేస్ట్ – ఒక కప్పు, టమాట ఫ్యూరీ – అర కప్పు, నువ్వులు – 2 టీ స్పూన్స్, పల్లీలు – ఒక టేబుల్ స్పూన్, ఎండు కొబ్బరి ముక్కలు – 4, ధనియాలు – 2 టీ స్పూన్స్, నానబెట్టిన చింతపండు – చిన్న నిమ్మకాయంత, దాల్చిన చెక్క- చిన్న ముక్క, లవంగాలు – 3, యాలకులు – 2, బిర్యానీ ఆకు – 1, సాజీరా – అర టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్.
మసాలా వంకాయ తయారీ విధానం..
ముందుగా కళాయిలో పల్లీలు, ధనియాలు, ఎండుకొబ్బరి ముక్కలు వేసి వేయించాలి. తరువాత నువ్వులు వేసి వేయించి జార్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో తగినన్ని నీళ్లు పోసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వంకాయలను వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 10 నిమిషాల పాటు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత మరికొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తరువాత మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. దీనిని 3 నిమిషాల పాటు వేయించిన తరువాత టమాట ఫ్యూరీ వేసి కలపాలి. దీనిని 2 నిమిషాల పాటు వేయించిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి.
తరువాత కారం, ఉప్పు, పసుపు వేసి కలపాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ ను వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత వేయించిన వంకాయలు వేసి కలపాలి. తరువాత చింతపండు రసం, అర గ్లాస్ నీళ్లు వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే వరకు బాగా ఉడికించాలి. చివరగా కొత్తిమీరను వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మసాలా వంకాయ తయారవుతుంది. దీనిని అన్నం, బగారా అన్నం, జీరా రైస్ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన మసాలా వంకాయ కూరను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.