Methi Matar Pulao : మనం మెంతి కూరను ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. మెంతికూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. మెంతికూరను తరచూ ఆహారంగా భాగంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కూరల్లో వాడడంతో పాటు దీనితో మనం ఎంతో రుచిగా ఉండే పులావ్ ను కూడా తయారు చేసుకోవచ్చు. పచ్చి బఠాణీ, మెంతికూరతో చేసే ఈ పులావ్ చేదు లేకుండా తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. ఎవరైనా కూడా ఈ పులావ్ ను సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ మేథీ మటర్ పులావ్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మేథీ మటర్ పులావ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చి బఠాణీ – ముప్పావు కప్పు, నూనె – 3 టేబుల్ స్పూన్స్, బిర్యానీ ఆకు – 1, లవంగాలు – 4, యాలకులు – 2, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, వెల్లుల్లి తరుగు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 3, తరిగిన మెంతికూర – 100 గ్రా., పసుపు – పావు టీ స్పూన్, నానబెట్టిన బాస్మతీ బియ్యం – ఒక కప్పు, ఉప్పు – తగినంత, వేడి నీళ్లు – 2 కప్పులు.
మేథీ మటర్ పులావ్ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు వేసి వేయించాలి. తరువాత అల్లం, వెల్లుల్లి తరుగు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవన్నీ చక్కగా వేగిన తరువాత మెంతి ఆకు వేసి వేయించాలి. పచ్చి వాసన పోయి నూనె పైకి తేలే వరకు ఈ మెంతి ఆకును బాగా వేయించుకోవాలి. తరువాత పసుపు వేసి కలపాలి. ఇప్పుడు పచ్చి బఠాణీ, ఉప్పు, నీళ్లు పోసి కలపాలి. దీనిపై మూత పెట్టి 12 నుండి 13 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తరువాత 15 నిమిషాల పాటు దీనిని కదిలించకుండా ఉంచి ఆ తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మేథీ మటర్ పులావ్ తయారవుతుంది. దీనిని రైతాతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. వీకెండ్స్ లో, స్పెషల్ డేసే లో ఇలా మెంతికూరతో పులావ్ ను తయారు చేసుకోవచ్చు. ఈ పులావ్ ను ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.