Methi Tomato Curry : మెంతి కూర.. చేదుగా ఉన్నప్పటికి మెంతికూరతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. మెంతికూరను తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. షుగర్ ను అదుపులో ఉంచడంలో, ఎముకలను ధృడంగా చేయడంలో, రక్తహీనతను తగ్గించడంలో, బాలింతలల్లో పాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేయడంలో ఇలా అనేక రకాలుగా మెంతికూర మనకు ఉపయోగపడుతుంది. మెంతికూరతో చేసిన వంటలను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. మెంతికూరతో సులభంగా చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో మెంతి టమాట కర్రీ కూడా ఒకటి. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం చాలా సులభం. ఎంతో రుచిగా ఉండే మెంతి టమాట కూరను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మెంతి టమాట కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
మెంతి ఆకు – 2 కట్టలు, టమాట ముక్కలు -ఒక కప్పు, తరిగిన పచ్చిమిర్చి – 5, ఎండుమిర్చి – 4, తరిగిన ఉల్లిపాయ – పెద్దది ఒకటి, వెల్లుల్లి రెబ్బలు – 5, నూనె – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత.
మెంతి టమాట కర్రీ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత జీలకర్ర వేసి వేయించాలి. జీలకర్ర వేగిన తరువాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిన తరువాత పసుపు, ఉప్పు వేసి కలపాలి. తరువాత టమాట ముక్కలు వేసి కలపాలి. ఇప్పుడు వీటిపై మూత పెట్టి టమాట ముక్కలను మెత్తగా ఉడికించాలి. టమాట ముక్కలు మెత్తబడిన తరువాత వీటిని గంటెతో మెత్తగా చేసుకోవాలి. తరువాత మెంతి ఆకు వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మరో 10 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత కూరనంతా మరోసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మెంతి టమాట కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. దీనిని తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.