Minapa Atlu : మినప పప్పుతో సహజంగానే చాలా మంది దోశలు, ఇడ్లీలను తయారు చేస్తుంటారు. కొందరు మసాలా వడలు, గారెలను కూడా తయారు చేస్తుంటారు. అయితే మినప పప్పుతో మినపట్లను కూడా తయారు చేయవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. రోజూ తినే రెగ్యులర్ బ్రేక్‌ఫాస్ట్‌లకు బదులుగా మినప పప్పుతో మినపట్లను తయారు చేసుకుని తింటే ఎంతో రుచిని ఆస్వాదించవచ్చు. పైగా మనకు మినప పప్పులో ఉండే పోషకాలు కూడా లభిస్తాయి. ఇక మినపట్లను తయారు చేయడం కూడా సులభమే. వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మినపట్ల తయారీకి కావల్సిన పదార్థాలు..
పొట్టు మినప పప్పు – ఒక గ్లాస్, ఇడ్లీ రవ్వ – మూడు గ్లాస్‌లు, నూనె – రెండు టీస్పూన్లు.
మినపట్లను తయారు చేసే విధానం..
మినప పప్పును రెండు లేదా మూడు గంటల పాటు నానబెట్టాలి. తరువాత పొట్టు తీసి మెత్తగా రుబ్బుకోవాలి. అనంతరం ఇడ్లీ రవ్వను కడిగి తగినంత ఉప్పు వేసి పిండిలో కలపాలి. ఈ మిశ్రమాన్ని 7-8 గంటల పాటు పక్కన ఉంచాలి. దీంతో బాగా పులుస్తుంది. అట్లు రుచిగా వస్తాయి. ఇక సమయం అయ్యాక పెనం వేడి చేసి కొద్దిగా నూనె వేయాలి. అది వేడి అయ్యాక మూడు లేదా నాలుగు గరిటల పిండిని ఒకేసారి మందంగా అట్టులా వేయాలి. దీన్ని చిన్న మంటపై రెండు వైపులా కాల్చుకోవాలి. రంగు మారే వరకు ఇలా అట్లను కాల్చాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే మినపట్లు తయారవుతాయి. వీటిని నేరుగా తినవచ్చు. లేదా టమాటా, పల్లి చట్నీతో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటాయి. పైగా మినప పప్పు ద్వారా మనం పోషకాలను కూడా పొందవచ్చు.