Minapa Rotte : మినప రొట్టె.. మినపప్పుతో చేసే ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా దీనిని ఎక్కువగా తీసుకుంటారు. పాతకాలంలో దీనిని ఎక్కువగా తయారు చేసే వారు. మినప రొట్టెను తీసుకోవడం వల్ల శరీరానికి బలం కలుగుతుంది. మినపప్పుతో తరుచూ చేసే ఇడ్లీ, దోశ వంటి వంటకాలతో పాటు ఇలా మినప రొట్టెను కూడా తయారు చేసి తీసుకోవచ్చు. రుచితో పాటు బలాన్ని ఇచ్చే మినప రొట్టెను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మినప రొట్టె తయారీకి కావల్సిన పదార్థాలు..
పొట్టుతో ఉండే మినపప్పు – ఒక కప్పు, బియ్యం రవ్వ – ఒకటిన్నర కప్పు, ఉప్పు – తగినంత, జీలకర్ర – అర టీ స్పూన్, బటర్ – ఒక టేబుల్ స్పూన్.
తేనె పానకం తయారీకి కావల్సిన పదార్థాలు..
బెల్లం తురుము – అర కప్పు, నీళ్లు – పావు కప్పు, దంచిన సోంపుగింజలు – ఒక టీ స్పూన్.
మినప రొట్టె తయారీ విధానం..
ముందుగా పప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి 4 గంటల పాటు నానబెట్టాలి. తరువాత రవ్వను కూడా కడిగి తగినన్ని నీళ్లు పోసి 4 గంటల పాటు నానబెట్టాలి. తరువాత పప్పును మరలా కడిగి జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలో వేసుకోవాలి. తరువాత రవ్వలో ఉండే నీటిని పిండేసి పిండిలో వేసుకోవాలి.తరువాత ఇందులో ఉప్పు, జీలకర్ర వేసి కలపాలి. తరువాత అడుగు మందంగా ఉండే కళాయిలో బటర్ వేసి వేడి చేయాలి. బటర్ కరిగిన తరువాత 5 నుండి 6 గంటెల పిండి వేసి పైన సమానంగా సర్దుకోవాలి. తరువాత మూత పెట్టి చిన్న మంటపై 15 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత దీనిని మరో వైపుకు తిప్పి మరలా 2 లేదా 3 టీ స్పూన్ల నూనె వేసుకోవాలి.
తరువాత మూత పెట్టి మరలా 5 నుండి 10 నిమిషాల పాటు ఉడికించాలి. రొట్టె ఉడికిన తరువాత ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు తేనె పాకం కోసం గిన్నెలో బెల్లం, నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే సోంపు గింజలు వేసి బెల్లం కరిగే వరకు ఉడికించాలి. దీనిని కొద్దిగా జిగురుగా అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దీనిని వడకట్టి ముందుగా తయారు చేసుకున్న మినప రొట్టెతో సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మినప రొట్టె, తేనెపాకం తయారవుతుంది. దీనిని తీసుకోవడం వల్ల ఎంతో రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.