Mirapakaya Bajji : మిర‌ప‌కాయ బ‌జ్జీల‌ను ఒక్క‌సారి ఇలా ట్రై చేయండి.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

Mirapakaya Bajji : మ‌నం శ‌న‌గ‌పిండితో సాయంత్రం స‌మ‌యాల్లో ర‌క‌ర‌కాల స్నాక్స్ ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. శ‌న‌గ‌పిండితో సుల‌భంగా చేసుకోద‌గిన చిరుతిళ్లల్లో బ‌జ్జీలు కూడా ఒకటి. బ‌జ్జీలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. మ‌నం కూడా అప్పుడ‌ప్పుడూ వీటిని త‌యారు చేస్తూనే ఉంటాము. ఈ బ‌జ్జీల‌ను మ‌రింత రుచిగా, క‌మ్మ‌గా, క్రిస్పీగా ఉండేలా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మిర‌ప‌కాయ బ‌జ్జీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బ‌జ్జీ మిర్చి – 10, పుట్నాల ప‌ప్పు – ఒక కప్పు, వాము – ఒక టీ స్పూన్, ఉప్పు -త‌గినంత‌, శ‌న‌గ‌పిండి – ఒక‌టిన్న‌ర క‌ప్పు, బియ్యం పిండి – 4 టీ స్పూన్స్, వంట‌సోడా – చిటికెడు, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Mirapakaya Bajji recipe in telugu make in this method
Mirapakaya Bajji

మిర‌ప‌కాయ బ‌జ్జీ త‌యారీ విధానం..

ముందుగా బజ్జీల‌ను శుభ్రంగా క‌డిగి త‌డి లేకుండా తుడుచుకోవాలి. త‌రువాత వాటికి నిలువుగా గాట్లు పెట్టుకుని లోప‌ల ఉండే గింజ‌ల‌ను తీసి వేయాలి. త‌రువాత జార్ లో పుట్నాల ప‌ప్పు, ఉప్పు, వాము వేసి పొడిగా చేసుకోవాలి. త‌రువాత ఈ పొడిని క‌ట్ చేసుకున్న మిర‌ప‌కాయ‌ల్లో స్ట‌ఫ్ చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో శ‌న‌గ‌పిండిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో వాము, ఉప్పు, బియ్యం పిండి, వంట‌సోడా వేసి క‌ల‌పాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని జారుడుగా కలుపుకోవాలి.

ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మిర‌ప‌కాయ‌ల‌ను పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై క‌ర‌క‌ర‌లాడే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఈ బ‌జ్జీల‌ను నేరుగా ఇలాగే తిన‌వ‌చ్చు లేదా ఈ బ‌జ్జీల‌ను మ‌ధ్య‌లోకి క‌ట్ చేసుకుని ఉల్లిపాయ‌, కొత్తిమీర‌, నిమ్మ‌ర‌సం, చాట్ మ‌సాలా చ‌ల్లుకుని కూడా తిన‌వ‌చ్చు. ఈ విధంగా ఇంట్లోనే రుచిక‌ర‌మైన బ‌జ్జీల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి.

Share
D

Recent Posts