Mirchi Bajji : శనగపిండితో మనం రకరకాల చిరుతిళ్లను తయారు చేసుకుని తింటూ ఉంటాం. శనగ పిండితో ఎక్కువగా చేసే చిరుతిళ్లల్లో మిర్చి బజ్జీ ఒకటి. వీటిని రుచి చూడని వారు ఉండరనే చెప్పవచ్చు. మనకు బయట హోటల్స్, రోడ్ల పక్కన బండ్ల మీద బజ్జీలు విరివిరిగా లభిస్తూ ఉంటాయి. బయట లభించే విధంగా రుచిగా ఉండే బజ్జీలను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. మొదటిసారి చేసే వారు కూడా వీటిని సులభంగా తయారు చేసుకోవచ్చు. స్ట్రీట్ స్టైల్ మిర్చీ బజ్జీలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మిర్చి బజ్జీ తయారీకి కావల్సిన పదార్థాలు..
మిర్చి బజ్జీ – పావు కిలో, శనగపిండి – రెండు కప్పులు, నీళ్లు – రెండు కప్పులు, వాము – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, పసుపు – చిటికెడు, కారం – తగినంత, ఉప్పు – తగినంత, వంటసోడా – పావు టీ స్పూన్, చింతపండు గుజ్జు – 2 టేబుల్ స్పూన్స్.
మిర్చి బజ్జీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో శనగపిండిని తీసుకోవాలి. తరువాత అందులో వాము, జీలకర్ర, పసుపు, కారం, ఉప్పు, వంటసోడా వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని గంటె జారుడుగా కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత గిన్నెలో చింతపండు గుజ్జును తీసుకోవాలి. తరువాత ఇందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా వాము వేసి కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చిని తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత తడి లేకుండా తుడుచుకోవాలి. ఇప్పుడు వాటిని నిలువుగా చీలి అందులో ఉండే గింజలను తీసి వేయాలి. తరువాత ఒక్కో మిర్చిని తీసుకుంటూ అందులో ముందుగా తయారు చేసుకున్న చింతపండు గుజ్జును ఉంచి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక మిర్చిని తీసుకుంటూ శనగపిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మిర్చి బజ్జి తయారవుతుంది. వీటిని నిమ్మరసం, ఉల్లిపాయలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా సాయంత్రం సమయాల్లో మిర్చి బజ్జీలను తయారు చేసుకుని తినవచ్చు. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.