Mirchi Masala Curry : మిర్చి మసాలా కర్రీ.. బజ్జీ మిర్చితో చేసే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంతో తింటే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, వంట చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు అప్పటికప్పుడు ఇలా మిర్చి మసాలా కర్రీని తయారు చేసి తీసుకోవచ్చు. ఈ కర్రీని తయారు చేయడం చాలా సులభం. 15 నుండి 20 నిమిషాల్లో ఈ కర్రీని తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే మిర్చి మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మిర్చి మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – పావు కప్పు, జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 4, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 2, కరివేపాకు – 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, బజ్జీ మిర్చి – 8, టమాటాలు – 3, నీళ్లు – 100 ఎమ్ ఎల్, కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్.
మిర్చి మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా బజ్జీ మిర్చిని అడ్డంగా రెండు భాగాలుగా కట్ చేసుకుని పక్కకు ఉంచాలి.తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి సగానికి పైగావేగిన తరువాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. తరువాత కొద్దిగా నీళ్లు పోసి కలిపి ఉల్లిపాయ ముక్కలను ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. తరువాత ఉప్పు, కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కలపాలి. మసాలాలన్నీ బాగా వేగిన తరువాత బజ్జీ మిర్చి వేసి కలపాలి.
తరువాత వీటిపై మూత పెట్టి మిర్చిని మగ్గించాలి. మిర్చి మగ్గిన తరువాత టమాటాలను ఫ్యూరీలాగా చేసి వేసుకోవాలి. దీనిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. తరువాత మూతపెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మిర్చి మసాలా కర్రీ తయారవుతుంది. వెరైటీ రుచులను కోరుకునే వారు ఇలా బజ్జీ మిర్చితో రుచిగా కూరను తయారు చేసి తీసుకోవచ్చు.