Miriyala Charu Recipe : మన వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో మిరియాలు ఒకటి. ఎంతో కాలంగా వీటిని మనం వంటల్లో వాడుతున్నాం. మిరియాలలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. వీటిని ఉపయోగించడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. వంటల్లోనే కాకుండా మిరియాలతో మనం రసాన్ని కూడా తయారు చేస్తూ ఉంటాం. మిరియాల రసం చక్కటి రుచిని కలిగి ఉంటుంది. పుల్లగా, ఘాటుగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా మిరియాల రసాన్ని చేసుకుని తినవచ్చు. మిరియాల రసాన్ని ఏవిధంగా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మిరియాల రసం తయారీకి కావల్సిన పదార్థాలు..
మిరియాలు – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 10 నుండి 12, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఎండుమిర్చి – 3, తరిగిన టమాట – 1, ఉప్పు – తగినంత, నానబెట్టిన చింతపండు – 10 గ్రా., నీళ్లు – 600 ఎమ్ ఎల్, కరివేపాకు – 4 రెమ్మలు, కొత్తిమీర – కొద్దిగా, ఇంగువ – పావు టీ స్పూన్.
మిరియాల రసం తయారీ విధానం..
ముందుగా రోట్లో మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసి కచ్చా పచ్చాగా దంచాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు వేసి వేయించాలి. తరువాత పసుపు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత టమాట ముక్కలను వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి. తరువాత ఉప్పు, చింతపండు రసం వేయాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. తరువాత ముందుగా దంచుకున్న మిరియాల మిశ్రమం వేసి కలపాలి. తరువాత ఇంగువ, కరివేపాకు, కొత్తిమీర వేసి ఒక పొంగు వచ్చే వరకు మరిగించాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మిరియాల రసం తయారవుతుంది.
ఈ రసాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటి వాటితో బాధపడుతున్నప్పుడు వేడి వేడిగా మిరియాల రసాన్ని చేసుకుని తినడం వల్ల చక్కటి ఉపశమనం కలుగుతుంది. అజీర్తి, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు వేధిస్తున్నప్పుడు మిరియాల రసాన్ని తీసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. చలికాలంలో ఈ విధంగా మిరియాల రసాన్ని చేసుకుని తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది.