Miriyala Rasam : మిరియాల రసం.. ఈ రసం ఎంత రుచిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఈ రసంతో భోజనం చేస్తే చక్కటి ఉపశమనం కలుగుతుంది. ఈ మిరియాల రసం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్పవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎవరైనా చాలా సులభంగా దీనిని తయారు చేసుకోవచ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్ని, జలుబు మరియు దగ్గు వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని అందించే ఈ మిరియాల రసాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మిరియాల రసం తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన చింతపండు – పెద్ద నిమ్మకాయంత, మిరియాలు – ఒక టేబుల్ స్పూన్, ధనియాలు – ఒక టీ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, వెల్లుల్లి రెబ్బలు – 5, నీళ్లు – 400 ఎమ్ ఎల్ లేదా తగినన్ని, కరివేపాకు రెమ్మలు – 2, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
తాళింపుకు కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, చిన్నగా తరిగిన వెల్లుల్లి రెమ్మలు – 4, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఇంగువ – అర టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ – 1, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – చిటికెడు.
మిరియాల రసం తయారీ విధానం..
ముందుగా జార్ లో మిరియాలు, ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీపట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో చింతపండు రసాన్ని తీసుకుని తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఇందులో మిక్సీ పట్టిన పొడితో పాటు మిగిలిన పదార్థాలు కూడా వేసి స్టవ్ మీద ఉంచి వేడి చేయాలి. రసం మరగడం మొదలు పెట్టిన తరువాత మరో 2 నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత తాళింపు కోసం కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి తాళింపు చేసుకోవాలి. తాళింపు వేగిన తరువాత దీనిని రసంలో వేసి మూత పెట్టాలి. ఒక నిమిషం పాటు అలాగే ఉంచి తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మిరియాల రసం తయారవుతుంది. దీనిని అన్నంతో తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.