Mixed Veg Curry : ఒకే కూరగాయతో కాకుండా అప్పుడప్పుడూ మనం మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీని తయారు చేస్తూ ఉంటాం. అన్నం, చపాతీ వంటి వాటిల్లోకి ఈ కూర చక్కగా ఉంటుంది. ఈ మిక్స్డ్ వెజ్ కర్రీని మరింత రుచిగా, సులభంగా, రెస్టారెంట్ స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలో.. అలాగే తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రెస్టారెంట్ స్టైల్ మిక్స్డ్ వెజ్ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన బంగాళాదుంప – 1, క్యాలిప్లవర్ ముక్కలు – ఒక కప్పు, తరిగిన క్యారెట్ – 1, తరిగిన బీన్స్ ముక్కలు – అర కప్పు, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 2, తరిగిన పచ్చిమిర్చి – 2, టమాట ఫ్యూరీ – ఒక కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, జీడిపప్పు పలుకులు – 10, జీలకర్ర – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి – ఒక టీస్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టేబుల్ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
రెస్టారెంట్ స్టైల్ మిక్స్డ్ వెజ్ కర్రీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో రెండు గ్లాసుల నీటిని పోయాలి. ఇందులో కూరగాయల ముక్కలను వేసి 10 నిమిషాల పాటు ఉడికించి వాటిలో నీటిని పారబోసి పక్కకు పెట్టుకోవాలి. తరువాత మరో కళాయిలో నువ్వులు, జీడిపప్పు వేసి వేయించాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత టమాట ఫ్యూరీ వేసి, ముందుగా మిక్సీ పట్టుకున్న జీడిపప్పు వేస్ట్ ను వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి.
తరువాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలుపుతూ ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. తరువాత ఉడికించిన వెజిటేబుల్ ముక్కలను, అర గ్లాస్ నీటిని పోసి 10 నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా కొత్తిమీరను వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రెస్టారెంట్ స్టైల్ మిక్స్డ్ వెజ్ కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, పుల్కా, రోటీ, పులావ్ వంటి వాటితో కలిపి తినవచ్చు. ఈ కూరను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.