Mixed Veg Paratha : మనం ఎక్కువగా అల్పాహారంలో భాగంగా ఆలూ, గోబి పరాటాలను తయారు చేస్తూ ఉంటాము. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. వీటితో పాటు మనం మిక్స్ వెజ్ పరాటాలను కూడా తయారు చేసుకోవచ్చు. మిక్స్ వెజ్ పరాటాలు కూడా చాలా రుచిగాఉంటాయి. లంచ్ బాక్స్ లోకి, అల్పాహారంగా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందించే ఈ మిక్స్ వెజ్ పరాటాలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మిక్స్ వెజ్ పరాటా తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమపిండి – ఒకటిన్నర కప్పు, ఉప్పు – కొద్దిగా, నూనె – 2 టీ స్పూన్స్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, క్యాబేజి తురుము – ముప్పావు కప్పు, చిన్నగా తరిగిన బీన్స్ – 6, క్యారెట్ తురుము – అర కప్పు, పనీర్ తురుము – పావు కప్పు, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, పసుపు – చిటికెడు, ఉప్పు – తగినంత, కారం – అర టీ స్పూన్, గరం మసాలా – చిటికెడు, చాట్ మసాలా – అర టీ స్పూన్.
మిక్స్ వెజ్ పరాటా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, నూనె వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. తరువాత చేత్తో వత్తుత్తూ మరో 5 నుండి 6 నిమిషాల పాటు పిండిని కలుపుకోవాలి. తరువాత ఉండలుగా చేసుకుని పైన మూత పెట్టి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో 2 టీ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. తరువాత పచ్చిమిర్చి, అల్లం తరుగు వేసి వేయించాలి. తరువాత క్యాబేజి తురుము. బీన్స్, క్యారెట్ తురుము, పనీర్ తురుము వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, చాట్ మసాలా వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత పిండి ముద్దను తీసుకుని దానిని ముందుగా వెడల్పుగా వత్తుకోవాలి.
తరువాత ఇందులో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల స్టఫింగ్ ను ఉంచి అంచులను మూసివేయాలి. తరువాత పొడి పిండి చల్లుకుంటూ ముందుగా చేత్తో వత్తుకోవాలి. తరువాత చపాతీ కర్రతో నెమ్మదిగా వత్తుకోవాలి. తరువాత పరోటాను వేడి వేడి పెనం మీద వేసి ముందుగా రెండు వైపులా కాల్చుకోవాలి. తరువాత నూనె వేసి చక్కగా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మిక్స్ పరాటా తయారవుతుంది. దీనిని ఆవకాయ, పెరుగు రైతాతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా మిక్స్ వెజ్ పరాటాను తయారు చేసి తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.