Molakala Curry : మనం చక్కటి ఆరోగ్యం కోసం మొలకెత్తిన గింజలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. మొలకెత్తిన గింజలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, బరువు తగ్గడంలో, కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో, ఎముకలను బలంగా చేయడంలో, రక్తహీనతను తగ్గించడంలో ఇలా అనేక రకాలుగా ఈ గింజలు మనకు సహాయపడతాయి. చాలా మంది వీటిని నేరుగా తీసుకుంటూ ఉంటారు. కొందరు వీటితో సలాడ్ ను చేసుకుంటూ ఉంటారు. ఇవే కాకుండా ఈ మొలకెత్తిన గింజలతో మనం ఎంతో రుచిగా ఉండే కర్రీని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ మొలకల కూరను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మొలకల కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
మొలకెత్తిన గింజలు – 100 గ్రా., పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, కర్బూజ గింజలు – 2 టేబుల్ స్పూన్స్, నువ్వులు – 2 టేబుల్ స్పూన్స్,ఎండు కొబ్బరి పొడి – 2 టీ స్పూన్స్, నూనె – 3 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, టమాటాలు – 2, నీళ్లు – 75 ఎమ్ ఎల్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మొలకల కర్రీ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో మొలకెత్తిన గింజలను తీసుకుని అవి మునిగే వరకు నీటిని పోసి ఉడికించాలి. గింజలు మెత్తగా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో పల్లీలు, కర్బూజ గింజలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత నువ్వులు వేసి వేయించాలి. తరువాత కొబ్బరి పొడి వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి.
దీనిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలపాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత టమాటాలను ఫ్యూరీలాగా చేసుకుని వేసుకోవాలి. దీనిని నూనె పైకి తేలే వరకు ఉడికించిన తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్, నీళ్లు వేసి కలపాలి. తరువాత ఉడికించిన గింజలు వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు ఉడికించిన తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మొలకల కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది.