Moong Dal : మనకు బయట షాపుల్లో లభించే చిరుతిళ్లల్లో మూంగ్ దాల్ కూడా ఒకటి. పెసరపప్పుతో చేసే మూంగ్ దాల్ కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుంది. చాలా మందికి ఇది ఫేవరేట్ స్నాక్ అని కూడా చెప్పవచ్చు. చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఇంట్లో జరిగే చిన్న చిన్న పార్టీలలో ఈ మూంగ్ దాల్ తప్పకుండా ఉంటుంది. అచ్చం బయట లభించేలా కరకరలాడుతూ రుచిగా ఉండే ఈ మూంగ్ దాల్ ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. బయట షాపుల్లో లభించే విధంగా ఉండే మూంగ్ దాల్ ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మూంగ్ దాల్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పెద్ద సైజులో ఉండే పెసరపప్పు – ఒక కప్పు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, ఉప్పు – కొద్దిగా.

మూంగ్ దాల్ తయారీ విధానం..
ముందుగా పెసరపప్పును గిన్నెలో తీసుకుని 2 నుండి 3 సార్లు బాగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. ఇలా నానబెట్టిన తరువాత పెసరపప్పును మరోసారి కడిగి నీళ్లు లేకుండా వడకట్టాలి. తరువాత దీనిని పొడి వస్త్రంపై వేసి ఒక గంట పాటు ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె మధ్యస్థంగా వేడయ్యాక నూనెలో చిన్న రంధ్రాలు ఉండే జల్లి గంటెను ఉంచి అందులో పెసరపప్పు వేసి వేయించాలి.
ఈ పెసరపప్పును స్పూన్ తో కలుపుతూ కరకరలాడే వరకు వేయించుకుని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా పెసరపప్పునంతావేయించిన తరువాత దీనిపై ఉప్పును చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మూంగ్ దాల్ తయారవుతుంది. దీనిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల రెండు నెలల పాటు తాజాగా ఉంటుంది. బయట కొనుగోలు చేసే పనిలేకుండా ఇలా ఇంట్లోనే చక్కగా, రుచిగా మూంగ్ దాల్ ను తయారు చేసుకుని తినవచ్చు.