Mullangi Pachadi : మనం ముల్లంగిని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. చాలా మంది ముల్లంగిని తినరు కానీ దీనిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ముల్లంగిని తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. గుండె ఆరోగ్యం మరియు మూత్రపిండాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తపోటును మరియు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో, బరువు తగ్గడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇలా అనేక రకాలుగా ముల్లంగి మనకు సహాయపడుతుంది. ముల్లంగితో మనం కూరలను తయారు చేస్తూ ఉంటాము. అలాగే దీనితో మనం ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. ముల్లంగి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎంతో కమ్మగా ఉండే ఈ ముల్లంగి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముల్లంగి పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
ముల్లంగి – 2, పల్లీలు – 2 టేబుల్ స్పూన్, శనగపప్పు- ఒక టేబుల్ స్పూన్, ధనియాలు -ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 15 లేదా కారానికి తగినన్ని, నూనె – ఒక టేబుల్ స్పూన్, పొడువుగా తరిగిన ఉల్లిపాయ – 1, చింతపండు – నిమ్మకాయంత, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – ఒక టీ గ్లాస్.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె -ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, కరివేపాకు – ఒక రెమ్మ, ఎండుమిర్చి – 2.
ముల్లంగి పచ్చడి తయారీ విధానం..
ముందుగా ముల్లంగిపై ఉండే పొట్టును తీసేసి శుభ్రంగా కడగాలి. తరువాత తరువాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో పల్లీలు, శనగపప్పు వేసి వేయించాలి. తరువాత ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి. తరువాత అదే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. తరువాత పసుపు, ముల్లంగి ముక్కలు, చింతపండు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి ముల్లంగి ముక్కలను మెత్తగా అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
తరువాత జార్ లో ముందుగా వేయించిన దినుసులను తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత వేయించిన ముల్లంగి ముక్కలు, నీళ్లు పోసి బరకగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత తాళింపుకు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలు వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత దీనిని పచ్చడిలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ముల్లంగి పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నంతో పాటు అల్పాహారాలతో కలిపి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈవిధంగా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ముల్లంగితో రుచికరమైన పచ్చడిని కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఈ పచ్చడిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.