Nagababu : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా నటించిన చిత్రం.. భీమ్లా నాయక్.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను భారీగా రాబడుతూ రికార్డుల వేట దిశగా ముందుకు సాగుతోంది. ఏపీలో థియేటర్లను మూసేసినా.. మిగిలిన అన్ని చోట్లా భారీగానే కలెక్షన్లను వసూలు చేస్తోంది. పవన్ సినిమా అంటే మినిమం గ్యారంటీ అన్న విషయాన్ని ఈ సినిమా మరోమారు రుజువు చేసింది. అయితే భీమ్లా నాయక్ చిత్రం విడుదల, ఏపీలో ఉన్న పరిస్థితులపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ఏపీ ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు. అలాగే పవన్ కల్యాణ్ పై కక్ష సాధిస్తుంటే ఇండస్ట్రీకి చెందిన అగ్ర హీరోలు, దర్శక నిర్మాతలు ఏం చేస్తున్నారని.. ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను శనివారం విడుదల చేశారు.
మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ చిత్రంపై ఏపీ ప్రభుత్వం కక్ష సాధిస్తుందని అన్నారు. ఆ సినిమాను తొక్కేయాలని చూస్తున్నారని ఆరోపించారు. భీమ్లా నాయక్‌కు, పవన్‌కు అన్యాయం జరుగుతుంటే ఇండస్ట్రీలోని అగ్ర హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఎందుకు స్పందించడం లేదని.. ఈ అన్యాయాన్ని వారు ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు.
ఇక రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కల్యాణ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడాడని.. కానీ ఇప్పుడు అతనికి అన్యాయం జరుగుతుంటే ఇండస్ట్రీకి చెందిన ఎవరూ మాట్లాడకపోవడం బాగా లేదని అన్నారు. పవన్ అవసరం అయితే తన సినిమాలను ఆపుకోవాలని చెప్పాడని.. అంతేకానీ తన కోసం చిత్ర పరిశ్రమకు అన్యాయం చేయొద్దని అన్నాడని.. అలాంటిది ఇప్పుడు పవన్ కోసం ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. ఏపీ ప్రభుత్వం పవన్‌ను, ఆయన సినిమాలను తొక్కేయాలని చూస్తుందని ఆరోపించారు.
ఒక హీరో సినిమాను తొక్కేస్తుంటే ఇంత మంది హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఉన్నా ఏ ఒక్కరూ స్పందించకపోవడం దారుణమన్నారు. చంపేస్తారని భయమా ? అని ప్రశ్నించారు. రేపు మీ సినిమాలకు సమస్య వస్తే పోరాడేందుకు పవన్ ముందుంటాడని అన్నారు. పవన్ కల్యాణ్ భయస్తుడు కాదని, ఎవరికీ భయపడడు.. అని అన్నారు.
భీమ్లా నాయక్ సినిమా హిట్ అయింది కాబట్టి ఓకే.. లేదంటే నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోయేవారని నాగబాబు అన్నారు. తన సినిమా ఫ్లాప్ అయినా ఫర్వాలేదు కానీ.. సినిమాను నమ్ముకున్న వారు నష్టపోవద్దు.. అనేది పవన్ సిద్ధాంతమని అన్నారు. చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం పవన్‌కు ఎదురవుతున్న పరిస్థితులు ఎవరికీ ఎదురు కాకూడదని అన్నారు. ఇక ఏపీ ప్రభుత్వంపై నాగబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతి ప్రభుత్వం 5 ఏళ్లకు మారుతుందని, ఈసారి జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాదని అన్నారు.