Natukodi Pulusu Recipe : నాటుకోడి పులుసు.. నాటుకోడితో చేసే ఈ పులుసు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ పులుసును ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. దీనిని ఒక్కొక్కరు ఒక్కోలా తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా చేసే ఈ నాటుకోడి పులుసు కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని అందరూ లొట్టలేసుకుంటూ తింటారనే చెప్పవచ్చు. ఈ పులుసును ఎవరైనా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. అందరికి నచ్చేలా చాలా సులభంగా ఘుమఘుమలాడుతూ ఉండే ఈ నాటుకోడి పులుసును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నాటుకోడి పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – అర కప్పు, కరివేపాకు – రెండురెమ్మలు, తరిగిన పచ్చిమిర్చి – 3, ఉల్లిపాయ -పెద్దది ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, ధనియాల పొడి – 2 టేబుల్ స్పూన్స్, కారం – పావు కప్పు, టమాటాలు – 2, పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, నాటుకోడి చికెన్ – అరకిలో, నీళ్లు – అరలీటర్, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – అర కట్ట.
మసాలా పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
ధనియాలు -ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 3, తోక మిరియాలు – ఒక టీ స్పూన్, అనాస పువ్వు – 1, నల్లయాలక్కాయ – 1, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, బిర్యానీ ఆకు – 1, యాలకులు – 4, లవంగాలు – 6, జాజికాయ పొడి – పావు టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 8.
మసాలా పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఎండు కొబ్బరి ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, సార పప్పు – 2 టీ స్పూన్స్, గసగసాలు – ఒక టీ స్పూన్, జీడిపప్పు – పావు కప్పు.
నాటుకోడి పులుసు తయారీ విధానం..
ముందుగా కళాయిలో మసాలా పొడికి కావల్సిన పదార్థాలు వేసి దోరగా వేయించాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్తని పొడిగా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే జార్ లో మసాలా పేస్ట్ కు కావల్సిన పదార్థాలు వేసి తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కుక్కర్ లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. తరువాత ఉల్లిపాయను పేస్ట్ లాగా చేసి వేసుకోవాలి. దీనిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత ధనియాల పొడి, కారం వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు వేయించిన తరువాత టమాటాలను ఫ్యూరీలాగా వేసుకోవాలి. తరువాత పెరుగు కూడా వేసి చిన్న మంటపై నూనె పైకి తేలే వరకు వేయించాలి. తరువాత నాటుకోడి చికెన్ వేసి కలపాలి.
మసాలాలు ముక్కలకు పట్టేలా కలుపుకున్న తరువాత నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మధ్యస్థ మంటపై 4 నుండి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత మూత తీసి మరలా స్టవ్ ఆన్ చేసి మసాలా పేస్ట్ వేసి కలపాలి. గ్రేవీ ఎక్కువగా కావాలనుకునే వారు మరో 200 ఎమ్ ఎల్ నీళ్లు పోసి ఉడికించాలి. కూర బాగా ఉడుకు పట్టిన తరువాత జీలకర్ర పొడి, మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసి కలపాలి. దీనిని చిన్న మంటపై నూనె పైకి తేలే వరకు ఉడికించిన తరువాత కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే నాటుకోడి చికెన్ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ ఇలా దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన నాటుకోడి చికెన్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.