Nimmakaya Karam : నిమ్మకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో, బరువు తగ్గడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో ఇలా అనేక రకాలుగా నిమ్మకాయలు మన సహాయపడతాయి. నిమ్మరసాన్ని వంటలు, జ్యూస్, షర్బత్ వంటి వాటి తయారీలో విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాము. అలాగే ఈ నిమ్మకాయలతో మనం ఎంతో రుచిగా ఉడే కారాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. నిమ్మకాయ కారం చాలా రుచిగా ఉంటుంది. పాత కాలంలో దీనిని ఎక్కువగా తయారు చేసేవారు. పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే ఈ నిమ్మకాయ కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మకాయ కారం తయారీకి కావల్సిన పదార్థాలు..
రసం ఎక్కువగా ఉండే నిమ్మకాయలు – 3, నూనె – 2 టీ స్పూన్స్, మెంతులు – పావు టీ స్పూన్, మినపప్పు – 3 టీ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 10 నుండి 15, ఇంగువ – రెండు చిటికెలు, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్.
నిమ్మకాయ కారం తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో నిమ్మరసాన్ని తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత మెంతులు, మినపప్పు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత ఎండుమిర్చి, ఆవాలు, ఇంగువ వేసి వేయించాలి. ఈ దినుసులన్ని చక్కగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత ఒక జార్ లో ఎండుమిర్చి, ఉప్పు, పసుపు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత మిగిలిన దినుసులన్నీ వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత నిమ్మరసం వేసి మరోసారి అంతా కలిసేలా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఈ కారాన్ని నేరుగా ఇలాగే తినవచ్చు లేదా తాళింపు కూడా వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే నిమ్మకాయ కారం తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు ఇలా అప్పటికప్పుడు నిమ్మకాయ కారాన్ని తయారు చేసుకుని తినవచ్చు.