Nimmakaya Nilva Pachadi : మనం నిమ్మకాయలను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. నిమ్మకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బరువు తగ్గవచ్చు. అలాగే చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. నిమ్మకాయ మన ఆరోగ్యానికి, అందానికి ఎంతో మేలు చేస్తుంది. వంటల్లో వాడడంతో పాటు నిమ్మకాయతో మనం ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే ఈ పచ్చడి సంవత్సరమంతా నిల్వ ఉంటుంది. నిమ్మకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎవరైనా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. సంవత్సరమంతా నిల్వ ఉండేలా నిమ్మకాయ నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మకాయ నిల్వ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
నిమ్మకాయలు – 25 లేదా కిలో, పసుపు – ఒక టీ స్పూన్, ఉప్పు – 50గ్రా., మెంతులు – ఒక టీ స్పూన్, ఆవాలు – 2 టీ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, నూనె – ముప్పావు కప్పు, ఇంగువ – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, వెల్లుల్లి రెబ్బలు- 15, కారం – 60 గ్రా..
నిమ్మకాయ నిల్వ పచ్చడి తయారీ విధానం..
ముందుగా నిమ్మకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. తరువాత వాటిని పది నిమిషాల పాటు ఆరబెట్టాలి. ఇప్పుడు సగం నిమ్మకాయలను నిలువుగా ముక్కలుగా కట్ చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. మిగిలిన నిమ్మకాయల రసాన్ని పిండి నిమ్మకాయ ముక్కల్లో వేసుకోవాలి. ఇప్పుడు వీటిలోనే ఉప్పు, పసుపు వేసి కలపాలి. ఇప్పుడు ఈ నిమ్మకాయ ముక్కలను గాజు సీసాలో వేసి 8 నుండి 10 రోజుల పాటు ఊరబెట్టుకోవాలి.ఈ ముక్కలను రోజూ కలుపుతూ ఉండాలి. తరువాత కళాయిలో మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి. తరువాత వీటిని జార్ లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మరో టీ స్పూన్ ఆవాలు, ఇంగువ, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి.
తాళింపు వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఊరబెట్టిన నిమ్మకాయలను గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో కారం, మిక్సీ పట్టుకున్న పొడి వేసి కలపాలి. తరువాత తాళింపు వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల నిమ్మకాయ నిల్వ పచ్చడి తయారవుతుంది. దీనిని గాలి, తడి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల సంవత్సరానికి పైగా నిల్వ ఉంటుంది. వేడి వేడి అన్నం నెయ్యితో కలిపి తింటే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. నిమ్మకాయలు ఎక్కువగా దొరికినప్పుడు ఇలా పచ్చడిని తయారు చేసుకుని నిల్వ చేసుకోవచ్చు.