Nizami Gosht : నిజామి ఘోష్ట్.. మటన్ తో చేసే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. నిజాం వంటకాల్లో ఇది కూడా ఒకటి. ముస్లింలు దీనిని ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. ఎక్కువ గ్రేవీతో, క్రీమీగా ఉండే ఈ మటన్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో తయారు చేసి తీసుకోవచ్చు. తరుచూ చేసే మటన్ కర్రీ కంటే ఈ విధంగా తయారు చేసిన మటన్ కర్రీ మరింత రుచిగా ఉంటుంది. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా, కమ్మగా ఉండే ఈ మటన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నిజామి ఘోష్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – పావు కప్పు, చిన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయలు – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, గంట పాటు ఉప్పు నీటిలో నానబెట్టిన లేత మటన్ – అరకిలో, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, నీళ్లు – 700 ఎమ్ ఎల్, ప్రెష్ క్రీమ్ – పావు కప్పు.
మసాలా పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
కర్బూజ గింజలు – 2 టీ స్పూన్స్, జీడిపప్పు – పావు కప్పు, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 5, అనాస పువ్వు – 1, బిర్యానీ ఆకు – 1, యాలకులు – 5, మిరియాలు – ఒక టీ స్పూన్, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, గసగసాలు – ఒక టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి – 6 లేదా తగినన్ని, కమ్మటి పెరుగు – అర కప్పు, నీళ్లు – తగినన్ని, పుదీనా ఆకులు – ఒక చిన్న కట్ట.
నిజామి ఘోష్ట్ తయారీ విధానం..
ముందుగా మసాలా పేస్ట్ కోసం కళాయిలో కర్బూజ గింజలు, జీడిపప్పు వేసి వేయించాలి. తరువాత మసాలా దినుసులు ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని అందులో పెరుగు, నీళ్లు, పుదీనా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కుక్కర్ లో నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత ఉల్లిపాయ తరుగు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత మటన్ వేసి 4 నిమిషాల పాటు వేయించాలి. తరువాత ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి.
తరువాత నీళ్లు పోసి కలిపి మూత పెట్టాలి. దీనిని 4 నుండి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరి పోయిన తరువాత మూత తీయాలి. మరలా స్టవ్ ఆన్ చేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్, మరో 100 ఎమ్ ఎల్ నీళ్లు పోసి 15 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత మరో టేబుల్ స్పూన్ నెయ్యి, ప్రెష్ క్రీమ్ వేసి కలిపి రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే నిజామి ఘోష్ట్ తయారవుతుంది. దీనిని బగారా అన్నం, తెల్ల అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన మటన్ కర్రీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.