iPhone : సాధారణంగా ఐఫోన్ అంటే చాలా ఖరీదు కలిగి ఉంటుంది. కనుక సామాన్యులు ఎవరూ ఆ ఫోన్లను కొనలేరు. ఒక్క ఐఫోన్‌కు పెట్టే ఖర్చుతో సాధారణ ఫోన్లు ఏకంగా 10 కొనవచ్చు. కనుక ధర ఎక్కువగా ఉంటాయని చెప్పి ఐఫోన్లను కొనేందుకు ఎవరూ ఇష్టపడరు. కేవలం స్థోమత ఉన్నవారు మాత్రమే వాటిని కొంటుంటారు. ఇక ఐఫోన్ ధర విషయంలో జోకులు కూడా పేలుస్తుంటారు. ఐఫోన్‌ను కొనాలంటే కిడ్నీని అమ్ముకోవాలని జోక్ చేస్తుంటారు. అయితే ఇకపై అలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా సులభంగా ఐఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. అలాగే ఏడాదికి ఒక కొత్త ఐఫోన్‌ను వాడుకోవచ్చు. అవును.. నమ్మశక్యంగా లేకున్నా.. ఇది నిజమే..!

టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ భారత్‌లోని తన వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్‌ను అందించేందుకు సిద్ధమవుతోంది. ఇకపై ఫోన్‌ను ఒకేసారి పెద్ద మొత్తం చెల్లించి కొనుగోలు చేయాల్సిన పనిలేదు. నెల నెలా నిర్దిష్టమైన మొత్తం చెల్లిస్తుంటే చాలు.. ఐఫోన్‌ను వాడుకోవచ్చు. ఇక ఏడాదికి ఒకసారి కొత్త ఐఫోన్ మోడల్స్ విడుదలవుతాయి. కనుక పాత ఐఫోన్‌ను ఇచ్చేసి మళ్లీ కొత్త ఐఫోన్‌ను అదేవిధానంలో తీసుకుని వాడవచ్చు. దీంతో వినియోగదారులకు ఐఫోన్‌ను వాడినట్లు ఉంటుంది. ఒకేసారి ఫోన్‌కు పెద్ద మొత్తం ఇవ్వాల్సిన పని ఉండదు. పైగా ఏడాదికి ఒక కొత్త ఐఫోన్‌ను వాడవచ్చు. దీంతోపాటు యాపిల్ అందించే యాప్ సబ్‌స్క్రిప్షన్ సేవలు కూడా ఉచితంగానే లభిస్తాయి. ఇలా యాపిల్ భారత్‌లోని స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు ఓ బంపర్ ఆఫర్‌ను అందించేందుకు సిద్ధమవుతోంది.
అయితే ఇప్పటికే పలు చోట్ల ఈ విధానాన్ని యాపిల్ ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సేవలను అందరికీ అందుబాటులోకి తెస్తుందని తెలుస్తోంది. దీంతో ఐఫోన్లను సులభంగా వాడుకోవచ్చు. వద్దనుకున్నప్పుడు ఇచ్చేసి కొత్త ఐఫోన్‌ను తీసుకుని మళ్లీ దాన్ని ఉపయోగించవచ్చు. ఇలా ఏటా విడుదలయ్యే కొత్త ఐఫోన్లను ఎప్పటికప్పుడు వాడుకోవచ్చు. ఇక యాపిల్ ఈ నూతన సదుపాయంపై త్వరలోనే ఒక ప్రకటన చేస్తుందని తెలుస్తోంది. దీని వల్ల ఎంతో మంది యూజర్లు నెల నెలా నిర్దిష్టమైన మొత్తం చెల్లించి కావల్సినన్ని రోజుల పాటు ఐఫోన్లను వాడుకునేందుకు వీలుంటుంది. దీని వల్ల ఐఫోన్లను వాడే యూజర్ల సంఖ్య కూడా పెరుగుతుందని యాపిల్ భావిస్తోంది. అయితే ఈ సదుపాయం ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో చూడాలి.