Oats Coconut Laddu : మనం ఓట్స్ ను కూడా ఆహారంగా తీసుకుంటూఉంటాము. ఓట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, బరువు తగ్గడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో ఇలా అనేక రకాలుగా ఓట్స్ మనకు సహాయపడతాయి. ఓట్స్ తో వివిధ రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. ఓట్స్ తో సులభంగా చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఓట్స్ కోకోనట్ లడ్డూలు కూడా ఒకటి. ఓట్స్, పచ్చి కొబ్బరి కలిపి చేసే ఈ లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. స్నాక్స్ గా తీసుకోవడానికి పిల్లలకు లంచ్ బాక్స్ లో పెట్టడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ ఓట్స్ కోకోనట్ లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఓట్స్ కోకోనట్ లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఓట్స్ – ఒక కప్పు, పచ్చి కొబ్బరి తురుము – ముప్పావు కప్పు, బెల్లం – ముప్పావు కప్పు, నీళ్లు – 2 టేబుల్ స్పూన్స్, యాలకుల పొడి – ఒక టీ స్పూన్, నెయ్యి – ఒక టీ స్పూన్.
ఓట్స్ కోకోనట్ లడ్డూ తయారీ విధానం..
ముందుగా కళాయిలో ఓట్స్ వేసి వేయించాలి. వీటిని కొద్దిగా రంగు మారే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని జార్ లో వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో బెల్లం తురుము, పచ్చి కొబ్బరి తురుము, నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగిన తరువాత ఓట్స్ వేసి కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని దగ్గర పడే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత నెయ్యి, యాలకుల పొడి వేసికలపాలి. ఈ మిశ్రమాన్ని ఉండ అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం గోరు వెచ్చగా అయిన తరువాత కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుని లడ్డూలాగా చుట్టుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఓట్స్ కోకోనట్ లడ్డూలు తయారవుతాయి. వీటిని తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.