Oats Guntha Ponganalu : ఓట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. ఓట్స్ తో రకరకాల వంటకాలను తయారు చేసి తీసుకుంటూ ఉంటాము. ఓట్స్ తో తరుచూ చేసే వంటకాలతో పాటు మనం గుంత పొంగనాలను కూడా తయారు చేసుకోవచ్చు. అల్పాహారంగా తీసుకోవడానికి, స్నాక్స్ గా తీసుకోవడానికి ఈ గుంతపొంగనాలు చాలా చక్కగా ఉంటాయి. ఉదయం పూట సమయం తక్కువగా ఉన్నప్పుడు, అల్పాహారంగా ఏం చేయాలో తోచనప్పుడు ఇలా ఓట్స్ తో గుంత పొంగనాలను తయారు చేసి తీసుకోవచ్చు. ఎంతో రుచిగా, క్రిస్సీగా ఉండే ఈ ఓట్స్ గుంతపొంగనాలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఓట్స్ గుంత పొంగనాల తయారీకి కావల్సిన పదార్థాలు..
సాధారణ ఓట్స్ – ఒక కప్పు, చిలికిన పెరుగు – ముప్పావు కప్పు, బియ్యంపిండి – పావు కప్పు, బొంబాయి రవ్వ – 2 టీ స్పూన్స్, క్యారెట్ తురుము – పావు కప్పు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, ఉప్పు – తగినంత,నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, వంటసోడా – పావు టీ స్పూన్.
ఓట్స్ గుంత పొంగనాల తయారీ విధానం..
ముందుగా కళాయిలో ఓట్స్ ను వేసి వేయించాలి. వీటిని క్రిస్పీగా అయ్యే వరకు వేయించి జార్ లోకి తీసుకోవాలి. తరువాత ఈ ఓట్స్ ను మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత పెరుగు, బియ్యంపిండి, రవ్వ వేసి కలపాలి. తరువాత క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి అరగంట పాటు నానబెట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ తాళింపును పిండిలో వేసి కలపాలి.
తరువాత కొత్తిమీర, వంటసోడా వేసి కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద గుంత పొంగనాల గిన్నెను ఉంచి అందులో నూనె వేసి వేడి చేయాలి. తరువాత పిండిని తీసుకుని గుంత పొంగనాలుగా వేసుకోవాలి. తరువాత మూత పెట్టి చిన్న మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. తరువాత మరో వైపుకు తిప్పుకుని కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఓట్స్ గుంత పొంగనాలు తయారవుతాయి. వీటిని నేరుగా తిన్నా లేదా చట్నీతో తిన్నా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఓట్స్ తో గుంతపొంగనాలను తయారు చేసి తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.