Oats Idli : ఓట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. వీటిని తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వీటితో రకరకాల వంటకాలను తయారు చేసి తీసుకుంటూ ఉంటాము. ఓట్స్ తో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. ఓట్స్ తో తరుచూ చేసే వంటకాలతో పాటు మనం ఇడ్లీలను కూడా తయారు చేసుకోవచ్చు. ఓట్స్ తో చేసే ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని ఇన్ స్టాంట్ గా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. ఉదయం పూట సమయం తక్కువగా ఉన్న వారు, వెరైటీ రుచులను కోరుకునే వారు వీటిని తయారు చేసి తీసుకోవచ్చు. ఓట్స్ తో రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఓట్స్ ఇడ్లీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఓట్స్ – ఒక కప్పు, ఉప్మా రవ్వ – అర కప్పు, పెరుగు – అర కప్పు, ఉప్పు – తగినంత, వంటసోడా – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, అల్లం ముక్కలు – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు – 2 టీ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఓట్స్ ఇడ్లీ తయారీ విధానం..
ముందుగా ఓట్స్ ను కళాయిలోవేసి క్రిస్పీగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత రవ్వను కూడా వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు జార్ లో ఓట్స్ ను వేసి మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో రవ్వ, పెరుగు వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. దీనిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు నానబెట్టాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి. తరువాత ఉప్పు, వంటసోడా వేసి కలపాలి. తరువాత మిగిలిన పదార్థాలు వేసి కలపాలి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ లో నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు మరిగిన తరువాత ఇడ్లీ ప్లేట్ లలో పిండి వేసుకుని కుక్కర్ లో ఉంచి మూత పెట్టి ఉడికించాలి. ఇడ్లీలు ఉడికిన తరువాత బయటకు తీసి కొద్దిగా చల్లారిన తరువాత ప్లేట్ లో వేసుకుని చట్నీతో సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఓట్స్ ఇడ్లీలు తయారవుతాయి. ఈ విధంగా తయారు చేసిన ఇడ్లీలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.