Oats Uthappam : మన ఆరోగ్యానికి ఓట్స్ ఎంతో మేలు చేస్తాయి. జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, గుండె ను ఆరోగ్యంగా ఉంచడంలో, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడంలో ఇలా అనేక రకాలుగా ఓట్స్ మనకు దోహదపడతాయి. ఓట్స్ తో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. వాటిలో ఓట్స్ ఊతప్పం కూడా ఒకటి. ఓట్స్ తో చేసే ఊతప్పం చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఇన్ స్టాంట్ గా 20 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. ఉదయం పూట సమయం తక్కువగా ఉన్నవారు, రోజూ ఒకేరకం టిఫిన్స్ తిని బోర్ కొట్టిన వారు ఇలా ఓట్స్ తో అప్పటికప్పుడు రుచికరమైన ఊతప్పలను తయారు చేసుకుని తినవచ్చు. ఎంతో రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా ఓట్స్ తో ఊతప్పలను ఇన్ స్టాంట్ గా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఓట్స్ ఊతప్పం తయారీకి కావల్సిన పదార్థాలు..
ప్లేన్ ఓట్స్ – ఒక కప్పు, ఉప్మా రవ్వ – ఒక కప్పు, పెరుగు – ఒక కప్పు, నీళ్లు -ఒక కప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, క్యారెట్ తురుము – కొద్దిగా, తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, వంటసోడా – పావు టీ స్పూన్.
ఓట్స్ ఊతప్పం తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో ఓట్స్, రవ్వ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో పెరుగు, నీళ్లు వేసి బాగా కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి పక్కకు 15 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. ఇప్పుడు ఒక గిన్నెలో క్యారెట్ తురుము, కొత్తిమీర, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి అంతా కలిసేలా కలుపుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు నానబెట్టిన పిండిలో ఉప్పు, వంటసోడా వేసి కలపాలి. తరువాత పిండిని తీసుకుని వేడి వేడి పెనం మీద ఊతప్పంలా వేసుకోవాలి. తరువాత దీనిపై క్యారెట్ మిశ్రమాన్ని వేసుకోవాలి. తరువాత నూనె వేసి మూత పెట్టి కాల్చుకోవాలి. ఊతప్పం ఒకవైపు కాలిన తరువాత మూత తీసి మరో వైపుకు తిప్పుకుని కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఓట్స్ ఊతప్పం తయారవుతుంది. దీనిని మనకు నచ్చిన చట్నీతో తినవచ్చు. ఈ విధంగా ఓట్స్ తో తయారు చేసిన ఊతప్పాన్ని తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.