Okra Mutton : బెండకాయ ఫ్రై అంటే ఇష్ట పడని వారు ఉండరు. అలాగే బెండకాయ పులుసు కూడా చాలా రుచి కరంగా ఉంటుంది. చాలా మంది బెండకాయను సాంబారులో కూడా వాడుతూ ఉంటారు. అంతే కాకుండా బెండకాయను చాలా రకాలుగా శాఖాహార వంటల్లో మాత్రమే ఎక్కువగా వాడుతూ ఉంటాం. అలాగే కొన్ని ప్రాంతాల్లో చేపలతో కలిపి కూడా వండుతూ ఉంటారు. కానీ బెండకాయను చికెన్ మటన్ లాంటి వాటితో కలిపి వండటం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. అయితే బెండకాయను మటన్ తో కలిపి వండుకోవచ్చు. ఇలా చేస్తే కాస్త వెరైటీతో పాటు మంచి రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడు బెండకాయ మటన్ ను ఎలా చేయాలో తెలుసుకుందాం.
బెండకాయ మటన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు..
బెండకాయలు – అరకిలో, మటన్- అరకిలో, నెయ్యి- 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర- 1 టీ స్పూను, దాల్చినచెక్క- 1 ముక్క, నల్ల యాలకులు- 4, మిరియాలు- 10, ఉల్లిపాయలు-2, పచ్చిమిర్చి-4, అల్లంవెల్లుల్లి పేస్టు-2 టీ స్పూన్లు, పసుపు – అర టీ స్పూను, ఉప్పు-తగినంత, ధనియాల పొడి-2 టీ స్పూన్లు, నూనె-2 టేబుల్ స్పూన్లు, టమాటాలు-2, కారం-1 టీ స్పూను,గరంమసాల పొడి-1 టీ స్పూను, కొత్తిమీర తరుగు-4 టేబుల్ స్పూన్లు.

బెండకాయ మటన్ తయారీ విధానం..
ముందుగా బెండకాయలను కడిగి తొడిమలు చివర్లు తీసేసి ఒకవైపు చీల్చి గాటు పెట్టుకోవాలి. ఒక బాణలిలో నూనె వేసి అది కాగాక కొద్దిగా జీలకర్ర వేసి అవి వేగాక బెండకాయలు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్రెషర్ కుక్కర్ లో నెయ్యి వేసి అది కాగాక మిగిలిన జీలకర్ర, దాల్చినచెక్క, నల్ల యాలకులు, మిరియాలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, మటన్ ముక్కలు వేసి కలపాలి. ఇప్పుడు అల్లంవెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసి కలపాలి.
మంచి నీళ్లు పోసి ఒక సారి కలిపి 10 నిమిషాలు ఉడికించాలి. తరువాత టమాట గుజ్జు, కారం, గరంమసాల వేసి కలపాలి. ఇప్పుడు కొత్తిమీర తురుము, వేయించిన బెండకాయలు కూడా వేసి ఉప్పు సరిచూసుకొని కుక్కర్ మూతపెట్టి ఒక విజిల్ వచ్చాక మంట తగ్గించి సిమ్ లో 20 నిమిషాల పాటు ఉడికించి దించుకోవాలి. ఇప్పుడు బెండకాయ మటన్ రెడీ అయిపోయినట్లే.