Onion Curry Leaves Soft Pakoda : ఉల్లిపాయలతో మనం వివిధ రుచుల్లో పకోడీలను తయారు చేస్తూ ఉంటాము. వాటిలో ఉల్లిపాయ కరివేపాకు మెత్తటి పకోడీ కూడా ఒకటి. ఈ పకోడీలు లోపల మెత్తగా, పైన క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. వీటిని 10 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు అప్పటికప్పుడు ఇలా వేడి వేడిగా పకోడీలను తయారు చేసి తీసుకోవచ్చు. సైడ్ డిష్ గా తీసుకోవడానికి, స్నాక్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. రుచిగా, సులభంగా చేసుకోగలిగే ఈ ఉల్లిపాయ కరివేపాకు మెత్తటి పకోడీలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయ కరివేపాకు మెత్తటి పకోడి తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, పచ్చిమిర్చి – 3, జీలకర్ర -ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, చింతపండు- ఒక టేబుల్ స్పూన్, కొత్తిమీర – అరకట్ట, శనగపిండి – ఒక కప్పు, బియ్యంపిండి – పావు కప్పు, వంటసోడా – పావు టీ స్పూన్, ముదురు కరివేపాకు – 2 కట్టలు, నూనె – డీప్ ప్రైకు సరిపడా.
ఉల్లిపాయ కరివేపాకు మెత్తటి పకోడి తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉప్పు,పసుపు, చింతపండు, కొత్తిమీర వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో శనగపిండిని, బియ్యంపిండిని తీసుకోవాలి. తరువాత వంటసోడా వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని బజ్జీ పిండిలా కలుపుకోవాలి. తరువాత ఇందులో కరివేపాకు, మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి బాగా కలపాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పిండిని తీసుకుంటూ పకోడీలా వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తరువాత మంటను పెద్దగా చేసి ఎర్రగా, క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ కరివేపాకు పకోడి తయారవుతుంది. ఈ విధంగా తయారు చేసిన పకోడిని ఒక్కటి కూడా విడిచి పెట్టకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.