Onion Mixture : మనకు చాట్ బండార్ లలో లభించే రుచికరమైన చిరుతిళ్లల్లో ఆనియన్ మిక్చర్ కూడా ఒకటి. అటుకులు, ఉల్లిపాయలతో చేసే ఈ మిక్చర్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ ఆనియన్ మిక్చర్ ను అదే రుచితో అంతే సులభంగా మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. కేవలం 10 నిమిషాల్లోనే దీనిని మనం తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ఆనియన్ మిక్చర్ ను సులభంగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆనియన్ మిక్చర్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, దొడ్డు అటుకులు – రెండు కప్పులు, పల్లీలు – పావు కప్పు, చిన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయలు – 2, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, చాట్ మసాలా – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నిమ్మరసం – అర చెక్క, నెయ్యి – ఒక టీ స్పూన్.
ఆనియన్ మిక్చర్ తయారీ విధానం..
ముందుగా అటుకులను జల్లించి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా వేడయ్యాక అటుకులను వేసి చక్కగా పొంగే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే నూనెలో పల్లీలు వేసి వేయించి అటుకుల్లో వేసుకోవాలి. తరువాత ఈ అటుకుల్లో మిగిలిన పదార్థాలను వేసి బాగా కలుపుకోవాలి. తరువాత ఈ మిక్చర్ ను గిన్నెలో వేసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లి మిక్చర్ తయారవుతుంది. ఇంట్లో అప్పటికప్పుడు ఇలా ఉల్లిపాయలతో రుచికరమైన మిక్చర్ ను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.