Onion Tomato Paratha : ఉల్లిపాయ టమాట పరాటా.. ఉల్లిపాయలు, టమాటాలతో చేసే ఈ పరాటా చాలా రుచిగా ఉంటుంది. తరుచూ చేసే పరాటాల కంటే ఈ పరాటాలు కొద్దిగా భిన్నంగా ఉంటాయి. వీటిని తయారు చేయడం మాత్రం చాలా సులభం. అల్పాహారంగా అలాగే లంచ్ బాక్స్ లోకి కూడా వీటిని తీసుకోవచ్చు. అలాగే వీటిని చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. ఉదయం పూట సమయం తక్కువగా ఉన్నప్పుడు, అల్పాహారంగా ఏం చేయాలో తోచనప్పుడు ఇలా పరాటాలను తయారు చేసి తీసుకోవచ్చు. ఎంతో రుచిగా, మెత్తగా ఉండే ఈ ఉల్లిపాయ టమాట పరాటాలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయ టమాట పరాటా తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ -అర టీ స్పూన్, చిన్నగా తరిగిన టమాటాలు – 2, పసుపు – పావు టీ స్పూన్, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత,చిన్నగా తరిగిన కొత్తిమీర – కొద్దిగా, కారం – అర టీ స్పూన్, చాట్ మసాలా – అర టీ స్పూన్, గోధుమపిండి – తగినంత.
ఉల్లిపాయ టమాట పరాటా తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత జీలకర్ర, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత టమాట ముక్కలు, పసుపు వేసి కలపాలి. టమాట ముక్కలు మెత్తగా మగ్గిన తరువాత గోధుమపిండి తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపాలి. ఈ కర్రీని మరో రెండు నిమిషాల పాటు మగ్గించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ కర్రీని వేరే ప్లేట్ లోకి తీసుకుని కొద్దిగా చల్లారనివ్వాలి. తరువాత కొద్ది కొద్దిగా గోధుమపిండిని వేస్తూ కలుపుకోవాలి.
తరువాత తగినన్నినీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. తరువాత పిండిని ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో ఉండను తీసుకుని చపాతీలాగా వత్తుకోవాలి. తరువాత దీనిపై నూనె వేసి చపాతీ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. తరువాత చపాతీని మడిచి మరలా వత్తుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పరాటాను వేడి పెనం మీద వేసి ముందుగా రెండు వైపులా కాల్చుకోవాలి. తరువాత నూనె లేదా బటర్ వేసి కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ టమాట పరాటా తయారవుతుంది. దీనిని నేరుగా తిన్నా లేదా పెరుగు చట్నీతో తిన్నా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన ఉల్లిపాయ టమాట పరాటాలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.