Pachi Chinthakaya Pachadi : మనం వంటింట్లో రకరకాల పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాము. వాటిలో పచ్చి చింతకాయ పచ్చడి కూడా ఒకటి. చింతకాయ పచ్చడి, పల్లీలు కలిపి చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని చూడగానే నోట్లో నీళ్లు ఊరతాయని చెప్పడంలో సందేహం లేదు. అన్నంతో, అల్పాహారాలతో తినడానికి ఈ పచ్చడి చాలా చక్కగా ఉంటుంది. లొట్టలేసుకుంటూ తినేంత రుచిగా ఉండే ఈ పచ్చిచింతకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చి చింతకాయ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – ఒక టేబుల్ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు -ఒక టీ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన ఉల్లిపాయ – 1, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు- తగినంత, వెల్లుల్లి రెబ్బలు – 4, చింతకాయ పచ్చడి – ఒక టేబుల్ స్పూన్, నూనె – 3 టేబుల్ స్పూన్స్.
పచ్చి చింతకాయ పచ్చడి తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో పల్లీలు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత శనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి. తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత ఇందులోనే ఉప్పు, కారం, చింతకాయ పచ్చడి, వెల్లుల్లి రెబ్బలు, నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఎండుమిర్చి, తాళింపు దినుసులు, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసి కలపాలి. తరువాత దీనిని నూనె పైకి తేలే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పచ్చిచింతకాయ పచ్చడి తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ పచ్చడిని అల్పాహారాలతో కూడా తినవచ్చు. అందరూ ఈ పచ్చడిని ఎంతో ఇష్టంగా తింటారు.