Pachi Kobbari Pachadi : మనం పచ్చి కొబ్బరిని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పచ్చి కొబ్బరిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, జుట్టును మరియు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఈ పచ్చి కొబ్బరి మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పచ్చి కొబ్బరిని నేరుగా తినడంతో పాటు దీనితో ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేస్తూ ఉంటాం. ఈ పచ్చడిని తయారు చేయడం చాలా సులభం. పచ్చి కొబ్బరితో పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
కొబ్బరికాయ – 1, పచ్చిమిర్చి – 10, నానబెట్టిన చింతపండు – చిన్న నిమ్మకాయంత, జీలకర్ర – ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 10, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, కరివేపాకు – ఒక రెమ్మ.
కొబ్బరి పచ్చడి తయారీ విధానం..
ముందుగా కొబ్బరి కాయ నుండి కొబ్బరిని సేకరించి తురుముకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పచ్చిమిర్చి వేసి వేయించాలి. పచ్చిమిర్చి వేగిన తరువాత జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే పచ్చి కొబ్బరి తురుము, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి పచ్చడిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి వేయించాలి. తరువాత కరివేపాకు, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి.
తాళింపు వేగిన తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసి కలపాలి. ఈ పచ్చడిని 3 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నంతో పాటు అల్పాహారాలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని విడిచిపెట్టకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. పచ్చి కొబ్బరితో ఈ విధంగా పచ్చడిని చేసుకుని తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.