Pala Purilu : సంప్ర‌దాయ వంట‌కం.. పాల పూరీలు.. రుచి చూస్తే అస‌లు విడిచిపెట్ట‌రు..

Pala Purilu : పాల పూరీలు.. క‌నుమ‌రుగ‌వుతున్న వంట‌కాల్లో ఇది ఒక‌టి. పాల పూరీలు అనే ఈ వంట‌కం గురించి ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మందికి తెలిసి ఉండ‌దు. వీటి రుచి గురించి ఎంత చెప్పిన త‌క్కువే. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఇవి ఉంటాయి. చ‌క్క‌టి రుచి క‌లిగి ఉండే ఈ పాల పూరీల‌ను మ‌నం చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వంట‌రాని వారు కూడా వీటిని సుల‌భంగా త‌యారు చేయ‌వ‌చ్చు. క‌మ్మ‌టి రుచిని క‌లిగి ఉండే ఈ పాల పూరీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి… త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

పాల పూరీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

గోధుమ పిండి – ఒక క‌ప్పు, ఉప్పు – చిటికెడు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, గ‌స‌గ‌సాలు – 2 టేబుల్ స్పూన్స్, బియ్యం పిండి – 2 టీ స్పూన్స్, జీడిప‌ప్పు – పిడికెడు, ప‌చ్చి కొబ్బ‌రి తురుము – అర క‌ప్పు, పాలు – ఒక లీట‌ర్, పంచ‌దార – ముప్పావు క‌ప్పు, యాల‌కుల పొడి – ఒక టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Pala Purilu recipe in telugu cultural food how to make it
Pala Purilu

పాల‌పూరీ తయారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో గోధుమ‌పిండి, ఉప్పు, నెయ్యి వేసి క‌లుపుకోవాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ పిండిని క‌లిపి ప‌క్క‌కు పెట్టుకోవాలి. త‌రువాత ఒక జార్ లో గ‌స‌గ‌సాలు, బియ్యం పిండి వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత జీడిప‌ప్పు వేసి ప‌లుకులు లేకుండా మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ప‌చ్చికొబ్బరి తురుము, త‌గిన‌న్ని పాలు వేసి వీలైనంత మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇప్పుడు ఒక క‌ళాయిలో మిక్సీ ప‌ట్టుకున్న జీడిప‌ప్పు మిశ్ర‌మాన్ని వేయాలి. త‌రువాత పాల‌ను పోసి చిన్న మంట‌పై క‌లుపుతూ వేడి చేయాలి. ఈ పాల‌ను ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు 20 నిమిషాల పాటు వేడి చేసిన త‌రువాత ఇందులో పంచ‌దార‌, యాల‌కుల పొడి వేసి క‌ల‌పాలి.

దీనిని మ‌రో 5 నిమిషాల పాటు క‌లుపుతూ మ‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిని తీసుకుని మ‌రోసారి బాగా క‌లిపి ముద్ద‌లుగా చేసుకోవాలి. త‌రువాత పొడి పిండి చ‌ల్లుకుంటూ పూరీని ప‌లుచ‌గా వ‌త్తుకోవాలి. త‌రువాత ఫోర్క్ తో పూరీకి రంధ్రాలు పెట్టుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల పూరీ పొంగ‌కుండా ఉంటుంది. ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగిన త‌రువాత అందులో పూరీల‌ను వేసి రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకోవాలి. ఇలా పూరీల‌ను కాల్చుకున్న త‌రువాత ఒక్కో పూరీని తీసుకుని ముందుగా త‌యారు చేసిన పాల‌ మిశ్ర‌మంలో ముంచి 15 సెక‌న్ల పాటు అలాగే ఉంచాలి.

15 సెక‌న్ల త‌రువాత ఈ పూరీని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని త‌యారు చేసుకున్న త‌రువాత వాటిపై మిగిలిన పాల మిశ్ర‌మాన్ని వేసుకంటూ ఈ పూరీల‌ను తినాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పాల పూరీలు త‌యార‌వుతాయి. ఈ పూరీలు మూడు రోజుల పాటు పాడ‌వ‌కుండా ఉంటాయి. సాయంత్రం స‌మ‌యాల్లో స్నాక్స్ గా వీటిని తిన‌వ‌చ్చు. ఈ పూరీలు ఎంతో బ‌ల‌వ‌ర్ద‌క‌మైన ఆహారం. వీటిని తిన‌డం వ‌ల్ల బ‌లంగా, పుష్టిగా త‌యార‌వుతారు.

D

Recent Posts