Palak Paneer Rice : మనం సులభంగా చేసుకోదగిన రైస్ వెరైటీలల్లో పాలక్ పనీర్ రైస్ కూడా ఒకటి. పాలకూర, పనీర్ కలిపి చేసే ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి ఇది చాలా చక్కగా ఉంటుంది. నోటికి రుచిగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ రైస్ ను తయారు చేసి తీసుకోవచ్చు. పాలక్ పనీర్ రైస్ ను తయారు చేయడం చాలా సులభం. ఎవరైనా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ పాలక్ పనీర్ రైస్ ను ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పాలక్ పనీర్ రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 3 టీ స్పూన్స్, పనీర్ – 200 గ్రా., పాలకూర – ఒకటిన్నర కప్పు, వెల్లుల్లి రెబ్బలు – 10, అల్లం – ఒక ఇంచు ముక్క, పచ్చిమిర్చి – 8, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు – 1, మరాఠీ మొగ్గలు – 2, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 5, యాలకులు – 3, నల్ల మిరియాలు – 10, నల్ల యాలకులు – 2, జీలకర్ర – అర టీ స్పూన్, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు, క్యారెట్ ముక్కలు – పావు కప్పు, పచ్చి బఠాణీ – పావు కప్పు, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, నానబెట్టిన బాస్మతీ బియ్యం – ఒకటిన్నర గ్లాస్, నీళ్లు – రెండు గ్లాసుల కంటే కొద్దిగా తక్కువ, కొత్తిమీర – కొద్దిగా, నిమ్మరసం – అర చెక్క.
పాలక్ పనీర్ రైస్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత పనీర్ ముక్కలు వేసి వేయించాలి. ఇందులోనే కొద్దిగా ఉప్పు, కారం వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో పాలకూర వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి. తరువాత జార్ లో వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, అల్లం వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత వేయించిన పాలకూర కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత కుక్కర్ లో నెయ్యి, మరో టేబుల్ స్పూన్ నూనెవేసి వేడి చేయాలి. తరువాత మసాలా దినుసులు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
ఇవి వేగిన తరువాత క్యారెట్, పచ్చిబఠాణీ వేసి వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి. తరువాత ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి. తరువాత బియ్యం వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. తరువాత వేయించిన పనీర్, నిమ్మరసం, కొత్తిమీర వేసి కలపాలి. తరువాతమూత పెట్టి మధ్యస్థ మంటపై ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ ఆవిరి అంతా పోయే వరకు అలాగే ఉంచి ఆ తరువాత మూత తీసి అంతా కలుపుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పాలక్ పనీర్ రైస్ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.