Palak Soya Curry : పాలక్ సోయా కర్రీ.. పాలకూర, మీల్ మేకర్ కలిపి చేసే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దేనితో తినడానికైనా ఇది చాలా చక్కగా ఉంటుంది. ఈ కర్రీని తయారు చేయడం చాలా సులభం. పాలకూరతో తరుచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా కూడా తయారు చేసి తీసుకోవచ్చు. ఈ పాలక్ సోయా కర్రీని ఒకసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు.ఎక్కువ మసాలాలు వేయకుండా కమ్మగా ఉండేలా పాలక్ సోయా కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పాలక్ సోయా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
మీల్ మేకర్ – ముప్పావు కప్పు, పాలకూర – 250 గ్రా., పచ్చిమిర్చి – 6 లేదా 7, నూనె – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – అర టీస్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ- 1, ఎండుమిర్చి – 2, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – తగినన్ని, గరం మసాలా – అర టీ స్పూన్, నిమ్మరసం – ఒక టేబుల్ స్పూన్.
పాలక్ సోయా కర్రీ తయారీ విధానం..
ముందుగా వేడి నీటిలో మీల్ మేకర్స్ ను వేసి 10 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత గిన్నెలో నీటిని పోసి వేడి చేయాలి. ఇందులోనే ఉప్పు కూడా వేసి నీటిని వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక పాలకూర వేసి 2 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ పాలకూరను వేరే గిన్నెలోకి తీసుకుని చల్లారనివ్వాలి. తరువాత ఈ పాలకూరను అలాగే పచ్చిమిర్చిని జార్ లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత నీటిలో వేసిన మీల్ మేకర్ లను చేత్తో పిండి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత మీల్ మేకర్ లను వేసి 4 నిమిషాల పాటు వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో మరో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. తరువాత జీలకర్ర వేసి వేయించాలి.
తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి వేసి వేయించాలి. ఇవన్నీ వేగిన తరువాత పసుపు వేసి కలపాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్, ఉప్పు వేసి కలపాలి. దీనిని 2 నిమిషాల పాటు వేయించిన తరువాత మీల్ మేకర్ వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి మీల్ మేకర్ మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. మీల్ మేకర్ ఉడికిన తరువాత గరం మసాలా, నిమ్మరసం వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పాలక్ సోయా కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన పాలక్ సోయా కర్రీని తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.