Palli Pakoda : మనం పల్లీలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పల్లీలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మనం అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చు. పల్లీలతో ఎంతో రుచిగా ఉండే పచ్చళ్లను, చట్నీలను, తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా పల్లీలతో మనం రుచిగా పల్లి పకోడాను కూడా తయారు చేసుకోవచ్చు. పల్లి పకోడా కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. మనకు స్వీట్ షాపుల్లో ఎక్కువగా ఈ పకోడా లభిస్తుంది. దీనిని మనం ఇంట్లో కూడా చాలా తేలకగా తయారు చేసుకోవచ్చు. రుచిగా పల్లి పకోడాను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పల్లి పకోడా తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – ఒక కప్పు, పచ్చిమిర్చి – 3, పసుపు – పావు టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, గరం మసాలా – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, శనగపిండి – ముప్పావు కప్పు, బియ్యం పిండి – పావు కప్పు, కరివేపాకు – కొద్దిగా.
పల్లి పకోడా తయారీ విధానం..
ముందుగా పచ్చిమిర్చిని పేస్ట్ గా చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో పల్లీలను తీసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి పేస్ట్ ను కూడా వేసుకోవాలి. తరువాత ఇందులో నూనె, కరివేపాకు తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత 2 టీ స్పూన్ల నూనె వేసి కలపాలి. తరువాత కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండి పల్లీలకు పట్టేలా కలుపుకోవాలి. పిండి గట్టిగా ఉండేలా చూసుకోవాలి. తరువాత వీటిని పది నిమిషాల పాటు కదిలించకుండా అలాగే ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె మధ్యస్థంగా వేడయ్యాక పల్లీలను వేసి వేయించుకోవాలి.
వీటిని మధ్యస్థం కంటే కొద్దిగా చిన్న మంటపై కరకరలాడే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. చివరగా అదే నూనెలో కరివేపాకును కూడా వేసి వేయించాలి. కరివేపాకు వేగిన తరువాత దీనిని పకోడాపై చల్లుకుని గార్నిష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పల్లి పకోడా తయారవుతుంది. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల వారం రోజుల పాటు తాజాగా ఉంటాయి. సాయంత్రం సమయాల్లో వీటిని స్నాక్స్ గా తినవచ్చు. ఈ పల్లి పకోడాలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.