Palli Patti : మనం పల్లీలను అలాగే బెల్లాన్ని కలిపి తింటూ ఉంటాం. అలాగే పల్లీలు, బెల్లాన్ని కలిపి మనం పల్లి పట్టీలు తయారు చేస్తూ ఉంటాం. ఇవి రెండు కూడా మన ఆరోగ్యానికి మేలు చేసేవే. వీటిని తినడం వల్ల మనం పోషకాలతో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ పల్లి పట్టీలను తయారు చేసుకుని తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. శరీరానికి కావల్సినంత శక్తి లభిస్తుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి.వీటిని పిల్లలకు ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది. ఈ పల్లి పట్టీలను మనం చాలా సలుభంగా తయారు చేసుకోవచ్చు. అచ్చం బయట షాపుల్లో లభించే విధంగా ఉండే ఈ పల్లి పట్టీలను ఇంట్లో సులభంగా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పల్లి పట్టి తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – ఒకటిన్నర కప్పు, బెల్లం తురుము – ఒక కప్పు, నెయ్యి – ఒక టీ స్పూన్, బేకింగ్ సోడా – పావు టీ స్పూన్.
పల్లి పట్టి తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో పల్లీలను వేసి చిన్న మంటపై దోరగా వేయించుకోవాలి. తరువాత వాటిపై పొట్టును తీసేసి రెండు ముక్కలుగా చేసుకోవాలి. తరువాత ఒక కళాయిలో బెల్లం తురుము వేసి వేడి చేయాలి. దీనిలో నీళ్లు వేయకుండా బెల్లం కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. బెల్లం కరిగిన తరువాత దీనిలో నెయ్యి వేసి కలపాలి. ఈ బెల్లాన్ని ముదురు పాకం వచ్చే వరకు వేడి చేయాలి. బెల్లం మిశ్రమాన్ని నీటిలో వేయగానే గట్టిగా ఉండలా అవ్వాలి. బెల్లం మిశ్రమం ఇలా ఉడికిన తరువాత ఇందులో బేకింగ్ సోడా వేసి కలపాలి. ఒకవేళ బెల్లం మిశ్రమం ఉండగా కాకపోతే మరికొద్ది సేపు ఉడికించి బేకింగ్ సోడా వేసి కలుపుకోవాలి. తరువాత ముక్కలుగా చేసిన పల్లీలను వేసి కలపాలి. బెల్లం మిశ్రమం పల్లీలకు పట్టగానే స్టవ్ ఆఫ్ చేయాలి.
దీనిని నెయ్యి రాసిన ఒక ప్లేట్ లోకి తీసుకుని పైన అంతా సమానంగా చేసుకోవాలి. ఈ మిశ్రమం కొద్దిగా ఆరిన కావల్సిన ఆకారంలో చాకుతో గాట్లు పెట్టుకోవాలి. దీనిని మూడు గంటల పాటు అలాగే ఉంచి ఆ తరువాత ముక్కలుగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పల్లి పట్టీలు తయారవుతాయి. ఈ పల్లి పట్టీలను రోజుకు ఒకటి లేదా రెండు చొప్పున తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.