Pandu Mirchi Chicken : మనం చికెన్ కర్రీని వివిధ రుచుల్లో వండుతూ ఉంటాము.ఏ విధంగా వండినా కూడా చికెన్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. మనం సులభంగా చేసుకోదగిన వెరైటీ చికెన్ కర్రీలలో పండుమిర్చి చికెన్ కూడా ఒకటి. పండుమిర్చి వేసి చేసే ఈ చికెన్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. స్పైసీగా తినాలనుకునే వారికి ఈ చికెన్ కర్రీ చాలా నచ్చుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. స్పైసీగ, టేస్టీగా ఉండే ఈ పండుమిర్చి చికెన్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పండుమిర్చి చికెన్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పండుమిర్చి – 75 గ్రా., ఉప్పు – తగినంత, జీలకర్ర – ఒక టేబుల్ స్పూన్, నూనె – పావు కప్పు, కరివేపాకు -ఒక రెమ్మ, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, ధనియాల పొడి -ఒక టేబుల్ స్పూన్, చికెన్ – అరకిలో, నీళ్లు – ఒక కప్పు, జీలకర్ర పొడి -ఒక టీ స్పూన్, గరం మసాలా -అర టీ స్పూన్.
పండుమిర్చి చికెన్ తయారీ విధానం..
ముందుగా చికెన్ ను ఉప్పు నీటిలో వేసి గంట పాటు నానబెట్టాలి. తరువాత ఒక జార్ లో పండుమిర్చి, ఉప్పు, జీలకర్ర, తగినన్ని నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలను పూర్తిగా వేయించాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి.
ఇలా వేయించిన తరువాత ధనియాల పొడి వేసి కలపాలి. తరువాత చికెన్ వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కలిపి మూత పెట్టాలి. ఈ చికెన్ ను చిన్న మంటపై ముక్కలు మెత్తగా అయ్యి కూర దగ్గర పడే వరకు ఉడికించాలి. చికెన్ మెత్తగా ఉడికిన తరువాత జీలకర్ర పొడి, గరం మసాలా వేసి కలపాలి. ఈచికెన్ ను మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పండుమిర్చి చికెన్ తయారవుతుంది. దీనిని అన్నం, ఉల్లిపాయలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. చికెన్ తో తరచూ ఒకేరకం వంటకాలు కాకుండా ఇలా వెరైటీగా రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు.