Pandu Mirchi Tomato Pachadi : మనం అనేక రకాల నిల్వ పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాం. ఇలా తయారు చేసే నిల్వ పచ్చళ్లలో పండు మిర్చి టమాట పచ్చడి కూడా ఒకటి. చాలా మంది కేవలం పండు మిర్చిని ఉపయోగించి పచ్చడిని తయారు చేస్తూ ఉంటారు. పండు మిర్చితో టమాటాలను కలిపి కూడా పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న పచ్చడి కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎంతో సులువుగా కూడా తయారు చేసుకోవచ్చు. పండు మిర్చి టమాట పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పండు మిర్చి టమాట పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
పండు మిర్చి – పావు కిలో, టమాటాలు – అర కిలో, మెంతులు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – 2 టీ స్పూన్స్, నూనె – 4 టేబుల్ స్పూన్స్, చింత పండు – 50 గ్రా., ఉప్పు – తగినంత.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక కప్పు, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినప పప్పు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, ఎండు మిరప కాయలు – 5, వెల్లుల్లి పాయ – ఒకటి, కరివేపాకు – రెండు రెబ్బలు.
పండు మిర్చి టమాట పచ్చడి తయారీ విధానం..
ముందుగా టమాటాలను, మిర్చిని శుభ్రంగా కడిగి తడి లేకుండా చేసుకుని గాలికి ఆరబెట్టిన తరువాత వేరు వేరుగా ముక్కలుగా చేసుకుని ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక కళాయిలో మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసి వేయించి చల్లారిన తరువాత జార్ లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనెను వేసి కాగిన తరువాత ముక్కలుగా చేసిన పండు మిర్చిని వేసి మధ్యస్థ మంటపై 3 నిమిషాల పాటు వేయించి పక్కకు తీసి పెట్టుకోవాలి. అదే కళాయిలో మరో టేబుల్ స్పూన్ నూనె వేసి టమాట ముక్కలను, చింతపండును వేసి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించి చల్లగా అయ్యే వరకు పక్కన ఉంచాలి.
ఇప్పుడు ఒక జార్ లో ముందుగా వేయించిన పండు మిరప కాయ ముక్కలను వేసి కచ్చా పచ్చాగా చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదే జార్ లో ఉడికించి పెట్టుకున్న టమాటాలను, ఉప్పును వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. దీనిని కూడా పండు మిరపకాయల పేస్ట్ లో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత తాళింపు పదార్థాలను వేసి తాళింపు చేసుకోవాలి. ఇలా చేసుకున్న తాళింపు చల్లగా అయ్యే వరకు ఉంచి ముందుగా కలిపి పెట్టుకున్న పండు మిరపకాయల మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల పండు మిర్చి టమాట పచ్చడి తయారవుతుంది. దీనిని తడి లేని గాజు సీసాలో ఉంచి ఫ్రిజ్ లో నిల్వ చేయడం వల్ల పచ్చడి 3 నెలల పాటు తాజాగా ఉంటుంది. పండు మిరపకాయలను, టమాటాలను తడి లేకుండా చేసుకోవడంతోపాటు నూనెను ఎక్కువగా ఉపయోగించడం వల్ల పచ్చడి పాడవకుండా ఎక్కువ కాలం పాటు తాజాగా ఉంటుంది. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యితోపాటు కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.