Paneer Curry : మనకు రెస్టారెంట్ లలో లభించే రుచికరమైన వంటకాల్లో పనీర్ కర్రీ కూడా ఒకటి. పనీర్ తో చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. చపాతీ, అన్నం ఇలా దేనితో తిన్నా కూడా ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ పనీర్ కర్రీని అదే రుచితో మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా దీనిని తేలికగా తయారు చేసుకోవచ్చు. రెస్టారెంట్ లలో లభించే విధంగా ఎంతో రుచిగా ఉండే పనీర్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పనీర్ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పనీర్ – 200 గ్రా., నూనె – 3 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, కారం – 1 లేదా 2 టీ స్పూన్స్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, ప్రోజెన్ బఠాణీ – 2 టేబుల్ స్పూన్స్, చిలికిన పెరుగు – పావు కప్పు, నీళ్లు – అర కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, కసూరి మెంతి – ఒక టీ స్పూన్.
మసాలా పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 4, యాలకులు – 3, అనాస పువ్వు – 1, జాపత్రి – కొద్దిగా, బిర్యానీ ఆకు – 1, అల్లం – ఒక ఇంచు ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 7, బాదం పప్పు – 5, జీడిపప్పు – 5, తరిగిన క్యారెట్ ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, పెద్ద ముక్కలుగా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పెద్ద టమాట – 1.
పనీర్ కర్రీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మసాలా పేస్ట్ కు కావల్సిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేస్తూ చక్కగా వేయించాలి. తరువాత వీటిపై మూత పెట్టి మెత్తబడే వరకు వేయించాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. అలాగే పనీర్ ను మధ్యస్థంగా ఉండే ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర వేసి వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలుపుతూ 3 నిమిషాల పాటు వేయించాలి. తరువాత ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు చల్లుకుని మసాలాలు మాడిపోకుండా వేయించాలి. తరువాత బఠాణీ వేసి కలపాలి.
తరువాత మంటను చిన్నగా చేసి పెరుగు వేసి కలపాలి. దీనిని ఉండలు లేకుండా కలుపుకున్న తరువాత మరో రెండు నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. తరువాత పనీర్ వేసి కలపాలి. ఇప్పుడు మరలా మూత పెట్టి మరో 4 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై ఉడికించాలి. పనీర్ చక్కగా ఉడికి నూనె పైకి తేలిన తరువాత కసూరి మెంతి, కొత్తిమీర వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పనీర్ కర్రీ తయారవుతుంది. అన్నం, చపాతీ, రోటీ, నాన్ వంటి వాటితో కలిపి తింటే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ పనీర్ కర్రీని తయారు చేసుకుని తినవచ్చు.