Paneer Pakoda : పనీర్ తో మనం రకరకాల కూరలను, చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాము. పనీర్ తో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. పనీర్ తో చేసుకోదగిన రుచికరమైన చిరుతిళ్లల్లో పనీర్ పకోడా కూడా ఒకటి. పనీర్ పకోడా చాలా రుచిగా ఉంటుంది. పనీర్ ను ఇష్టపడని వారు కూడా వీటిని ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. స్నాక్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఒక్కసారి వీటిని రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇవే కావాలంటారు. ఈ పనీర్ పకోడాలను తయారు చేసుకోవడం చాలా సులభం. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు, స్నాక్స్ తినాలనిపించినప్పుడు వీటిని తయారు చేసి తీసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ పనీర్ పకోడాలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి.. ఇప్పుడు తెలుసుకుందాం.
పనీర్ పకోడా తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపిండి – ఒక కప్పు, వాము – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, కారం – ముప్పావు టీ స్పూన్, వంటసోడా – అర టీ స్పూన్, కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, పనీర్ – పావు కిలో, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
పుదీనా చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
కొత్తిమీర – గుప్పెడు, పుదీనా – గుప్పెడు, పచ్చిమిర్చి – 1, అల్లం – కొద్దిగా, ఉప్పు – తగినంత, నిమ్మరసం – అర చెక్క, నీళ్లు – తగినన్ని.
పనీర్ పకోడా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో శనగపిండిని తీసుకోవాలి. తరువాత పనీర్, నూనె తప్ప మిగిలిన పదార్థాలు వేసి బాగా కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ దోశ పిండిలాగా కలుపుకుని పక్కకు ఉంచాలి. తరువాత పుదీనా చట్నీ కోసం జార్ లో చట్నీకి కావల్సిన పదార్థాలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పనీర్ ను తీసుకుని పలుచగా చతురస్రాకారంలో ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత ఒక పనీర్ ముక్కను తీసుకుని దానిపై పుదీనా చట్నీని రాసుకుని దానిపై మరో పనీర్ ముక్కను ఉంచాలి. ఇలా అన్నింటిని సిద్దం చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఈ పనీర్ ను శనగపిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పనీర్ పకోడా తయారవుతుంది. వీటిని టమాట కిచప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా తయారు చేసిన పనీర్ పకోడాలను ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.