Pappu Thotakura Vadalu : మనకు సాయంత్రం సమయంలో బండ్ల మీద లభించే వివిధ రకాల చిరుతిళ్లల్లో తోటకూర వడలు కూడా ఒకటి. ఈ వడలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఈ వడలు పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఈ వడలను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. తోటకూరకు బదులుగా ఇతర ఆకుకూరలతో కూడా ఈ వడలను తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా సులభం. స్ట్రీట్ స్టైల్ తోటకూర వడలను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తోటకూర వడల తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్నగా తరిగిన తోటకూర – 3 కట్టలు, 5 గంటల పాటు నానబెట్టిన శనగపప్పు – 5 గంటలు, ఎండుమిర్చి – 3, పచ్చిమిర్చి – 3, వెల్లుల్లి రెబ్బలు – 5, అల్లం – అర అంగుళం ముక్క, తరిగిన ఉల్లిపాయ – 1, జీలకర్ర -అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
తోటకూర వడల తయారీ విధానం..
ముందుగా జార్ లో నానబెట్టిన శనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసి మరీ మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకుని అందులో తరిగిన తోటకూర, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలపాలి. పిండి పలుచగా అయితే కొద్దిగా బియ్యంపిండి వేసి కలుపుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని వడలాగా వత్తుకోవాలి. తరువాత ఈ వడలను నూనెలో వేసి కాల్చుకోవాలి. ఈ వడలను అటూ ఇటూ తిప్పుతూ మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే తోటకూర వడలు తయారవుతాయి. ఈ వడలను టమాట కిచప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఆకుకూరలు తినని పిల్లలకు ఇలా వడలు చేసి పెట్టడం వల్ల వారు సులభంగా ఆకుకూరలను తినగలుగుతారు.