Peanut Dates Laddu : ఖర్జూరాలు.. మనం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో ఇవి కూడా ఒకటి. ఖర్జూరాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రక్తహీనతను తగ్గించడంలో, ఎముకలను ధృడంగా మార్చడంలో, శరీరానికి కావల్సిన పోషకాలను అందించడంలో ఇలా అనేక రకాలుగా ఖర్జూరాలు మనకు సహాయపడతాయి. వీటిని నేరుగా తినడంతో పాటు ఈ ఖర్జూరాలతో మనం ఎంతో రుచిగా ఉండే లడ్డూలను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని కేవలం నిమిషాల వ్యవధిలోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఖర్జూరాలతో లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పల్లీ ఖర్జూరం లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – ఒక కప్పు, ఖర్జూరాలు – ఒక కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్, నెయ్యి – 4 టీ స్పూన్స్.
పల్లీ ఖర్జూరం లడ్డూ తయారీ విధానం..
ముందుగా పల్లీలను కళాయిలోవేసి దోరగా వేయించాలి. తరువాత వీటిపై ఉండే పొట్టును తీసేసి జార్ లో వేసుకోవాలి. తరువాత వీటిని బరకగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే జార్ లో ఖర్జూరం ముక్కలను వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ ఖర్జూరం ముద్దను ముందుగా సిద్దం చేసుకున్న పల్లీ పొడిలో వేసి కలపాలి. తరువాత యాలకుల పొడి, నెయ్యి వేసి కలపాలి. ఇప్పుడు కావల్సిన పరిమాణంలో లడ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పల్లీ ఖర్జూరం లడ్డూలు తయారవుతాయి. వీటిని రోజుకు ఒకటి చొప్పున తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. పిల్లలకు వీటిని ఇవ్వడం వల్ల మరింత మేలు కలుగుతుంది.