Peanut Rolls : మనం పల్లీలతో వివిధ రకాల తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. పల్లీలతో చేసే తీపి వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. పల్లీలతో చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో పీనట్ రోల్స్ కూడా ఒకటి. ఈ రోల్స్ చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు వీటిని ఇష్టంగా తింటారు. వీటిని పిల్లలకు ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల కూడా చక్కగా ఉంటుంది. అలాగే ఈ రోల్స్ ను అప్పటికప్పుడు చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ పీనట్ రోల్స్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పీనట్ రోల్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు -ఒక కప్పు, యాలకులు – 8, బెల్లం తురుము – ఒక కప్పు, నెయ్యి – ఒక టీ స్పూన్.
పీనట్ రోల్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో పల్లీలు వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై కదుపుతూ మంచి రంగు వచ్చే వరకు వేయించాలి. తరువాత వీటిని ప్లేట్ లో వేసి పొట్టు పోయేలా చేసుకోవాలి. తరువాత ఈ పల్లీలను జార్ లో వేసుకోవాలి. ఇందులోనే యాలకులు వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఇందులోనే బెల్లం వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో నెయ్యి వేసి కలపాలి. తరువాత కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుని చిన్న చిన్న రోల్స్ లాగా చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పీనట్ రోల్ తయారవుతుంది. వీటిని నేరుగా ఇలాగే తినవచ్చు లేదా వీటిని కొబ్బరి పొడితో గార్నిష్ చేసి కూడా తీసుకోవచ్చు. ఇలా పల్లీలతో రుచికరమైన పీనట్ రోల్స్ ను చేసి తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.