Perugu Dosa : మనం మన రుచికి తగినట్టు రకరకాల దోశలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. దోశలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. దోశలను తయారు చేసుకోవడానికి పప్పు నానబెట్టి పిండిని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. పిండి రుబ్బకుండా అలాగే ఎక్కువ శ్రమ లేకుండా అప్పటికప్పుడు ఎంతో రుచిగా దోశలను మనం తయారు చేసుకోవచ్చు. పెరుగు వేసి చేసే ఈ దోశలను కేవలం పది నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ పెరుగు దోశలు చాలా రుచిగా కూడా ఉంటాయి. నిమిషాల వ్యవధిలోనే తయారయ్యే ఈ పెరుగు దోశలను ఎలా చేయాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పెరుగు దోశల తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం పిండి – ఒక కప్పు, పుల్లటి పెరుగు – ముప్పావు కప్పు, ఉప్పు – తగినంత, నీళ్లు – తగినన్ని.
పెరుగు దోశల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బియ్యంపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో పెరుగు, ఉప్పు వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ దోశపిండిలా కలుపుకోవాలి. తరువాత స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెసం వేడయ్యాక తగినంత పిండిని తీసుకుని దోశలా వేసుకోవాలి. ఈ దోశను మరీ పలుచగా కాకుండా మందంగా , ఊతప్పంలా వేసుకోవాలి. తరువాత దీనిపై నూనె వేసుకుని మూత పెట్టిఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. తరువాత దోశను మరో వైపుకు తిప్పి కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పెరుగు దోశలు తయారవుతాయి. పుల్లటి పెరుగు అందుబాటులో లేని వారు పిండిని కలిపి ఒక గంట పాటు నానబెట్టుకుని కూడా దోశలు వేసుకోవచ్చు. వీటిని ఏ చట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. ఉదయం అల్పాహారంగా ఏం చేయాలో తోచనప్పుడు, అలాగే సమయం తక్కువగా ఉన్నప్పుడు ఇలా పెరుగు దోశలను తయారు చేసుకుని తినవచ్చు. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.