Perugu Pakodi : పెరుగు పకోడి..పేరు చూడగానే అర్థమైపోతూ ఉంటుంది. పెరుగు మరియు పకోడీలు కలిపి చేసే ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు ఏవి లేనప్పుడు ఈ కూరను తయారు చేసుకుని తినవచ్చు. ఒక్కసారి ఈ కూరను రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. పెరుగు పకోడిని తయారు చేయడం చాలా సులభం. వంటరానివారు, మొదటిసారి చేసేవారు ఎవరైనా దీనిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో కమ్మగా ఉండే ఈ పెరుగు పకోడి తయారీ విధానాన్ని.. తయారీకి కావల్సిన పదార్థాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పెరుగు పకోడి తయారీకి కావల్సిన పదార్థాలు..
పకోడీ తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపిండి – ఒక కప్పు, చిన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, కారం – అర టీ స్పూన్, ఉప్పు -తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, వాము – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, వంటసోడా – కొద్దిగా.
మజ్జిగ పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపిండి – ఒక టీ స్పూన్, పెరుగు – ముప్పావు కప్పు, పసుపు – పావు టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, నీళ్లు – ఒకటిన్నర గ్లాస్, ఉప్పు – తగినంత.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, పొడువుగా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, గరం మసాలా -అర టీ స్పూన్.
పెరుగు పకోడి తయారీ విధానం..
ముందుగా పకోడీలను తయారు చేసుకోవడానికి గిన్నెలో శనగపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలు వేసి కలుపుకోవాలి. తరువాత నీళ్లు పోసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ బాల్స్ లాగా గుండ్రంగా వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత మజ్జిగ పులుసుకు గిన్నెలో శనగపిండిని తీసుకోవాలి. తరువాత నీళ్లు తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కలుపుకోవాలి. తరువాత నీళ్లు పోసిఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత తాళింపుకు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి.
తరువాత తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, ఉల్లిపాయలు,పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత మజ్జిగ పులుసు వేసి కలపాలి. దీనిని ఒకపొంగు వచ్చే వరకు కలుపుతూ ఉడికించాలి. తరువాత గరం మసాలా, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత పకోడీలు వేసి మూత పెట్టి 2 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. 2 నిమిషాల తరువాత అంతా కలుపుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పెరుగు పకోడి తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది.