Pesara Pappu Pulusu : పెసరపప్పును కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. పెసరపప్పును తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. దీనితో పప్పు కూరలతో పాటు మనం ఎంతో రుచిగా ఉండే పులుసును కూడా తయారు చేసుకోవచ్చు. పెసరపప్పు పులుసు చాలా రుచిగా ఉంటుంది. ఈ పులుసును మనం రాచిప్పలో కూడా చేసుకోవచ్చు. పూర్వకాలంలో రాచిప్పలో ఎక్కువగా పులుసును తయారు చేసేవారు. రాచిప్పలో చేసే పులుసును తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. రాచిప్పలో పెసరపప్పు పులుసును ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పెసరపప్పు పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసరపప్పు – అర కప్పు, సాంబార్ ఉల్లిపాయలు – 12, పచ్చిమిర్చి – 6, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – 650 ఎమ్ ఎల్, నిమ్మకాయలు – ఒకటిన్నర, తరిగిన కొత్తిమీర – అర కట్ట.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఎండుమిర్చి – 2, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, కరివేపాకు – రెండు రెమ్మలు.
పెసరపప్పు పులుసు తయారీ విధానం..
ముందుగా కళాయిలో పెసరపప్పు వేసి చిన్న మంటపై దోరగా వేయించాలి. తరువాత ఈ పప్పును శుబ్రంగా కడిగి మెత్తగా ఉడికించాలి. తరువాత రాచిప్పలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, 400 ఎమ్ ఎల్ నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి. నీళ్లు బాగా మరిగిన తరువాత ఉడికించిన పప్పు వేసి కలపాలి. దీనిని మరో పొంగు వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఇందులో నిమ్మరసం వేసి కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలు వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత దీనిని పులుసులో వేసి కలపాలి. తరువాత కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పెసరపప్పు పులుసు తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. రాచిప్పలో చేయడం వల్ల పులుసు 4 నుండి 5 గంటల పాటు వేడిగా ఉంటుంది. ఈ పులుసును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.