Pesara Pappu Saggu Biyyam Payasam : సగ్గు బియ్యాన్ని వేసవి కాలంలో తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. ఈ సగ్గు బియ్యానికి పెసర పప్పును కూడా చేర్చి పాయసం తయారు చేసుకోవచ్చు. పెసర పప్పు వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. బరువు తగ్గడంలో, అజీర్తి సమస్యను తగ్గించడంలో పెసర పప్పు ఎంతగానో సహాయపడుతుంది. పెసర పప్పును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల తిమ్మిర్ల వ్యాధి తగ్గుతుంది. ఇన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్న పెసర పప్పును.. సగ్గుబియ్యంతో కలిపి పాయసంలా తయారు చేసి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. పైగా పోషకాలు, ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. మరి దీన్ని ఎలా తయారు చేయాలి, తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పెసర పప్పు, సగ్గుబియ్యం పాయసం తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసర పప్పు – ఒక కప్పు, సగ్గు బియ్యం – ఒక కప్పు, బెల్లం తురుము – 2 కప్పులు, చిక్కని పాలు – అర లీటర్, యాలకుల పొడి – అర టీ స్పూన్, నెయ్యి – 2 టీ స్పూన్స్, డ్రై ఫ్రూట్స్ – తగినన్ని.
పెసర పప్పు, సగ్గుబియ్యం పాయసం తయారీ విధానం..
ముందుగా సగ్గుబియ్యంలో నీళ్లను పోసి ఒక గంట పాటు నానబెట్టాలి. పాలని కాచి చల్లార్చాలి. తరువాత ఒక కుక్కర్‌లో పెసర పప్పుకు సరిపడా నీటిని పోసి మెత్తగా ఉడికించుకోవాలి. ఒక గిన్నెలో బెల్లం తురుము వేసి ఒక కప్పు నీటిని పోసి కరిగే వరకు కలిపి కొద్దిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో గిన్నెలో రెండున్నర కప్పుల నీళ్లను పోసి, ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి, 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తరువాత సగ్గుబియ్యంలో బెల్లం కరిగించుకున్న నీటిని, ఉడికించిన పెసర పప్పును వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత మూత పెట్టి మరో 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పాయసం కొద్దిగా చల్లారిన తరువాత కాచి చల్లార్చిన పాలను పోసి బాగా కలుపుకోవాలి. ఒక చిన్న కళాయిలో నెయ్యి వేసి కాగాక డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ ని ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాయసంలో వేసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పెసర పప్పు, సగ్గుబియ్యం పాయసం తయారవుతుంది. దీనిని వేసవి కాలంలో తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే తగ్గి, శరీరం చల్లబడుతుంది. సగ్గు బియ్యంతో పెసర పప్పును కలిపి పాయసం చేయడం వల్ల రుచితోపాటు ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది.