Pesara Ukkiri : పెసరపప్పు మన ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు మన శరీరానికి కూడా చలువ చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. పెసరపప్పుతో కూరలే కాకుండా మనం తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. పెసరపప్పుతో చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో పెసర ఉక్కిరి కూడా ఒకటి. పెసర ఉక్కిరి చాలా రుచిగా ఉంటుంది. ఇన్ స్టాంట్ చేసుకోదగిన ఆరోగ్యకరమైన తీపి వంటకాల్లో ఇది కూడా ఒకటి. పెసరపప్పుతో ఎంతో రుచికరమైన పెసర ఉక్కిరిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పెసర ఉక్కిరి తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసరపప్పు – ఒక కప్పు, గోధుమ రవ్వ – అర కప్పు, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, వేడి నీళ్లు – 4 కప్పులు, బెల్లం – 2 కప్పులు, యాలకుల పొడి – అర టీ స్పూన్, నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ – కొద్దిగా.
పెసర ఉక్కిరి తయారీ విధానం..
ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడిగి నీటిని వడకట్టి పక్కకు ఉంచాలి. అలాగే రవ్వను కూడా కడిగి నీటిని వడకట్టి పక్కకు ఉంచాలి. ఇప్పుడు ఒక గిన్నెలో బెల్లం తురుము, పావు కప్పు నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి దానిని వడకట్టి పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక పెసరపప్పు వేసి చక్కగా వేయించాలి. పెసరపప్పు రంగు మారిన తరువాత వేడి నీళ్లు పోసి కలపాలి. తరువాత ఈ పెసరపప్పును మెత్తగా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మరో కళాయిలో ఒక టీ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత గోధుమ రవ్వను వేసి వేయించాలి. గోధుమ రవ్వ వేగిన తరువాత మూడు కప్పుల వేడి నీటిని పోసి ఉడికించాలి. రవ్వ మెత్తగా ఉడికిన తరువాత మంటను చిన్నగా చేసి ముందుగా ఉడికించిన పెసరపప్పు కూడా వేసి కలపాలి. తరువాత బెల్లం నీటిని పోసి కలపాలి.
దీనిని ఉండలు లేకుండా చక్కగా కలుపుకున్న తరువాత మరో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కలపాలి. తరువాత దీనిని నెయ్యి పైకి తేలే వరకు బాగా ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పెసర ఉక్కిరి తయారవుతుంది. దీనిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు ఇలా పెసరపప్పుతో అప్పటికప్పుడు ఎంతో రుచికరమైన స్వీట్ ను తయారు చేసుకుని తినవచ్చు.